అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఘర్షణ తీవ్రమవుతోన్న నేపథ్యంలో భారత్ తన అంతర్జాతీయ వ్యూహాన్ని అత్యవసరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని గురువారం లోక్‌సభ ముందుకు వచ్చిన 2025–26 ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సెమీ-కండక్టర్లు, అరుదైన మూలకాల చుట్టూ వేగంగా ప్రపంచం పునర్వ్యవస్థీకరణ జరుగుతోన్న తరుణంలో భారత్ ‘వ్యూహాత్మక అనివార్యత’ను సాధించాలని, లేదంటే వెనుకబడిపోయే ప్రమాదం ఉందని సర్వే హెచ్చరించింది. ఇంధన వనరులు, అరుదైన మూలకాలు, చిప్ తయారీ, సాఫ్ట్‌వేర్ నమూనాలపై నియంత్రణను పొందడం ద్వారా ఏఐ వేల్యూ ఛైన్‌పై ఆధిపత్యం చేలాయించేందుకు ప్రయత్నించే అమెరికా నేతృత్వంలోని ‘పాక్స్ సిలికా’ అనే భారీ కార్యక్రమం ఈ పునర్వ్యవస్థీకరణకు కేంద్ర బిందువుగా ఉందని సర్వే పేర్కొంది.
ఇది చమురు, ఉక్కు యుగం ముగింపును, ‘కంప్యూట్’ అంతిమ శక్తిగా మారే యుగం ఆరంభాన్ని సూచిస్తుందని సర్వే తెలిపింది. అమెరికా ప్రపంచ సాంకేతిక మ్యాప్‌ను చురుకుగా మారుస్తోంది. అధునాతన సెమీకండక్టర్లు, వాటి తయారీకి అవసరమైన పరికరాలను చైనాకు అందకుండా నిరోధించడానికి అమెరికా విస్తృత ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిస్పందనగా.. హై-టెక్ పరిశ్రమలకు కీలకమైన అరుదైన మూలకాలు, మాగ్నెట్ ఎగుమతులను చైనా పరిమితం చేసింది. అంతేకాకుండా అనేక విదేశీ సంస్థలనుపై కూడా చైనా నిషేధం విధించింది. ఈ చర్యలు కేవలం బలప్రదర్శనకే పరిమితం కాదని, ఇరు దేశాలు తమ సామర్థ్యాన్ని పక్కనపెట్టి, రాజకీయంగా నడిచే ఆర్థిక నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తూ పూర్తిస్థాయి ‘వ్యూహాత్మక పోటీ’ లోకి దిగాయని సర్వే వివరించింది.
మరోవైపు, తన అంతర్గత పోరాటాలతోనూ చైనా సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం, బలహీనమైన దేశీయ డిమాండ్, సంక్షోభంలో ఉన్న స్థిరాస్తి రంగం తో ఆర్థిక స్తబ్దత నెలకొందని సర్వే తెలిపింది. తన అంతర్గత చోదకశక్తి మందగిస్తున్నందున, వృద్ధిని కొనసాగించడానికి చైనా తయారీ, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. గతేడాది డిసెంబరులో హైనాన్‌లో ఫ్రీ ట్రేడ్ పోర్టును ప్రయోగాత్మకంగా బీజింగ్ ప్రారంభించింది. కస్టమ్స్, పెట్టుబడి నిబంధనలను సడలించడం ద్వారా బాహ్య ఒత్తిడిలను అధిగమించడం దీని లక్ష్యం.
దీనికి విరుద్ధంగా అమెరికా ఒక ప్రత్యేక సాంకేతిక కూటమి ఏర్పాటుకు వడివడిగా ముందుకు సాగుతోంది. పాక్స్ సిలికా ద్వారా తమలాంటి ఆలోచనలు కలిగిన దేశాలను కలుపుకుని, సప్లయ్ ఛైన్, భౌగోళిక రాజకీయ సమన్వయంతో సురక్షితమైన AI పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోంది. ఈ క్రమంలో అధునాతన పరికరాలు, కీలకమైన ఏపీఐలు, సెమీకండక్టర్ ఉత్పత్తిని నియంత్రించే దేశాలకు అధికారం లభిస్తుందని, అవి వ్యూహాత్మకంగా అనివార్యంగా మారతాయని సర్వే హెచ్చరించింది.
భారత్ వెనుకబడిపోయే పరిస్థితిని భరించలేదని సర్వే పేర్కొంది. కేవలం ‘బ్యాక్-ఆఫీస్’ ఆర్థిక వ్యవస్థగా ఉండే వైఖరిని వదిలిపెట్టి, ఏ దేశమూ సులభంగా ప్రత్యామ్నాయం చేయలేని ఉత్పత్తులు, సేవలతో ప్రపంచ వెల్యూ ఛైన్‌తో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలి. ఇందులో కీలకమైన దేశీయ ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంచుకోవడం, విదేశీ డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కూడా ఉన్నాయి. భారత్ అలా చేయడంలో విఫలమైతే, సాంకేతిక నిరాకరణ, వ్యూహాత్మక పరపతితో ఎక్కువగా నిర్వచించే ప్రపంచంలో ఒక ‘క్లయింట్ దేశం’గా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa