ఇంటిని, వంటగదిలో శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక్కోసారి ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఈగలు, బొద్దింకలు, దోమలు, పండ్ల ఈగలు వస్తుంటాయి. ఇవి ఇంటి వాతావరణాన్ని పాడు చేయడమే కాకుండా ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే వీటిని వదిలించుకోవాలి. చాలా మంది వీటిని ఇంటి నుంచి తరిమికొట్టడానికి మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ అంటే స్ప్రేలు, మందులు వాడుతుంటారు. అయితే, ఇంట్లో చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు ఇవి హాని చేసే అవకాశం ఉంది.
అయితే, కొన్ని సహజ నివారణలతో వీటిని ఇంటి నుంచి తరిమికొట్టొచ్చు. అలాంటి వాటిలో కర్పూరం ఒకటి. పూజ కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగించే కర్పూరాన్ని పండ్ల ఈగలు, దోమలు, బొద్దింకలు, ఇతర పురుగుల్ని తరిమికొట్టడానికి వాడొచ్చు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ చటోరి చెట్నా కర్పూరంతో కొన్ని ఇంటి చిట్కాల్ని షేర్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ హ్యాక్స్ షేర్ చేశారు. కర్పూరాన్ని ఉపయోగించి బొద్దింకలు, ఈగలు, దోమల్ని ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు చుద్దాం.
కర్పూరం బిళ్లలను మూటకట్టి నిల్వ చేయండి
వంటగదిలో చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి బొద్దింకలు. ఇవి ఎక్కడి పడితే అక్కడ కనిపిస్తూ చిరాకు తెప్పిస్తాయి. ఇవి పాత్రలు, ఆహారాలపై తిరుగుతుంటారు. ఇలాంటి ఆహారాల్ని తింటే ఆరోగ్యం ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది. కిచెన్ క్యాబినెట్లు, అల్మారాలు బొద్దింకలకు ఆవాసాలుగా ఉంటాయి.
అయితే వీటిని తరిమికొట్టడానికి కర్పూరం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని కర్పూరం బిళ్లల్ని తీసుకోండి. వీటిని టిష్యూ పేపర్ లేదా సన్నని వస్ర్తంలో చుట్టండి. వాటిని మూటలా కట్టండి. ఇప్పుడు ఈ మూటను కిచెన్ క్యాబినెట్లు, అల్మారాల్లో ఉంచండి. దీంతో బొద్దింకలు, పురుగులు ఆ దరిదాపుల్లో కనిపించవు. కర్పూరం ఘాటైనా వాసనకు అవి వంటగదికి దూరంగా ఉంటాయి.
పండ్ల ఈగల్ని ఇలా తరిమికొట్టండి
మనం చాలా సార్లు గమనించే ఉంటాం. ఇంట్లో పండ్లు చుట్టూ తరచుగా ఈగలు కనిపిస్తాయి. వీటిని ఫ్రూట్ ఫ్లైస్ అంటారు. తెలుగులో పండ్ల ఈగలు అని పిలుస్తారు. ఇవి పండ్ల మీద వాలుతుంటాయి. దీంతో, ఆ పండ్లు క్రీములు, బ్యాక్టీరియాలకు ఆవాసాలుగా మారుతుంటాయి.
అందుకే పండ్ల ఈగల్ని తరిమికొట్టాలి. వాటిని దూరంగా ఉంచడానికి కర్పూరం బిళ్లల్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం రెండు కర్పూరం బిళ్లల్ని కాల్చి.. ఆ తర్వాత పండ్లు చుట్టూ తిప్పండి. ఈ చిట్కా అన్ని పండ్ల ఈగల్ని తరిమివేస్తుంది. మీ పండ్లను శుభ్రంగా ఉంచుతుంది.
ఇంటి నుంచి ఈగలు, దోమలు పరార్
ఈ చిట్కా కేవలం పండ్ల ఈగలకు మాత్రమే కాదు సాధారణ ఈగలు, దోమలకు కూడా బాగా పనికొస్తుంది. కర్పూరం బిళ్లల్ని ఉపయోగించి దోమలు, ఈగలు వచ్చే ప్రాంతాల్లో ఆ పొగను వ్యాపించేలా చేయండి. కర్పూరం యొక్క ఘాటైన వాసనకు దోమలు, ఈగలు ఇంటి నుంచి పారిపోతాయి. ఈ చిట్కా ఈగలు, దోమల్ని చాలా వరకు దూరంగా ఉంచుతుంది. కర్పూరం మండించడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన సువాసన ఏర్పడుతుంది.
కర్పూరాన్ని ఇలా కూడా వాడొచ్చు
కర్పూరం, వాటర్ స్ప్రేతో దోమలను సులభంగా తరిమికొట్టొచ్చు. దోమల్ని తరిమికొట్టడానికి రెండు కర్పూరం ముక్కలను నీటిలో కలపండి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఒక స్ప్రే బాటిల్లో నింపి మూలల్లో, మంచం దగ్గర, కిటికీలు, తలుపుల చుట్టూ పూర్తిగా పిచికారీ చేయండి. ఇలా చేయడం వల్ల దోమల్ని ఇంటి నుంచి దూరంగా ఉంచవచ్చు
కర్పూరం, వేప నూనెతో దీపం వెలిగించవచ్చు. దానిని వెలిగించడానికి దీపంలో వేపనూనె పోసి కర్పూరం ముక్కను జోడించండి. ఇప్పుడు దీపంలో ఒక వత్తిని ఉంచి వెలిగించండి. మీరు ఈ దీపాన్ని కిటీకీలు, ఇంటి గుమ్మం దగ్గర ఉంచవచ్చు. దీంతో, దోమలు, ఈగలు ఇంట్లోకి వచ్చే సాహసం చేయవు.
ఇల్లు తుడిచే నీటిలో కర్పూరం
సాధారణంగా మనం ఇల్లును తుడుచుకుంటూ ఉంటాం. ఈ నీటిలో పెనాయిల్ లేదా కెమికల్ లిక్విడ్స్ కలిపి వాడుతుంటాం. అయితే, వీటి బదులు కర్పూరం వాడితే మంచిది. కర్పూరంలో ఎటువంటి రసాయనాలు ఉండవు. ఇందుకోసం కర్పూరం బిళ్లల్నీ బాగా దంచుకుని మెత్తగా చేయండి.
ఇప్పుడు కర్పూరం పొడిని ఇల్లు తుడిచే నీటిలో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆ నీటితో ఇల్లు మొత్తం తుడవండి. కిచెన్ కౌంటర్, వంటగదిని కూడా తుడుచుకుండి. ఇలా చేయడం వల్ల ఈగలు, కీటకాలు ఇంట్లోకి రావు. అంతేకాకుండా ఇల్లు సువాసనతో నిండిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa