ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీ సమయం చాలా కీలకం. ఈ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా చాలా మంది మహిళలు మానసిక ఒత్తిడి, ఆందోళనను కూడా ఎదుర్కొంటారు. అందుకే ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోమని పెద్దలతో పాటు నిపుణులు సలహా ఇస్తారు. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో వాకింగ్ చేయాలా వద్దా అన్న చాలా మంది మహిళలు సంశయంలో ఉంటారు.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఎంతసేపు వాకింగ్ మంచిది, ఎంతసేపు హానికరం అన్న విషయంలో గందరోగోళం చెందుతారు. చాలా మంది పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తుంటారు. అయితే, కొందరు నిపుణులు శారీరక శ్రమను ప్రోత్సహిస్తారు. ప్రెగ్నెన్నీ హెల్త్ కోచ్ మంకీరత్ కౌర్ ప్రకారం వాకింగ్ మంచి ఆప్షన్. నడక తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా శిశువు అభివృద్ధి, రక్త ప్రసరణ, ప్రసవానికి సిద్ధం కావడానికి కూడా సాయపడుతుంది. మంకీరత్ కౌర్ ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో ఏ నెలలో ఎంతసేపు నడవాలో ఇప్పుడు చుద్దాం.
మొదటి త్రైమాసికం (మొదటి మూడు నెలలు)
మొదటి మూడు నెలలు చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ నిలబడటానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ సమయంలో రోజూ 15 నుంచి 20 నిమిషాలు సాధారణ వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వికారం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ఈ వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వికారం, ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా వాకింగ్ వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఈ సమయంలో వేగంగా నడవడానికి బదులుగా సౌకర్యవంతమైన వేగంతో నడవడం మంచిది.
ప్రెగ్నెన్నీ సమయం ఏ నెలలో ఎంత నడవాలి?
రెండో త్రైమాసికం (3 నుంచి 6 నెలలు)
ఇది గర్భధారణలో అత్యంత స్థిరమైన దశగా పరిగణిస్తారు నిపుణులు. ఈ సమయంలో శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో వాకింగ్ దశను పెంచవచ్చని మంకీరత్ కౌర్ అంటున్నారు. రోజూ 30 నుంచి 40 నిమిషాలు నడవాలని సూచిస్తున్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా రక్తపోటు అదుపులో ఉంటుంది. నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువును నిర్వహించడంలో సాయపడుతుంది. ఈ దశలో మీరు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా నడవచ్చు. అయితే, బ్రిస్క్ వాకింగ్ వద్దు. మీడియం స్పీడ్‌తో నడిస్తే సరిపోతుంది.
మూడో త్రైమాసికం (6 నుంచి 9 నెలలు)
ఇది డెలివరీకి సిద్ధం కావాల్సిన సమయం. అందుకే సరైన మొత్తంలో నడవాలని మంకీరత్ కౌర్ అభిప్రాయపడుతున్నారు. 45 నుంచి 60 నిమిషాలు నడవాలని నిపుణులు అంటారు. అయితే, ఒకేసారి నడవకుండా విరామాలు తీసుకుంటూ వాకింగ్ చేస్తే మంచిది.
ఇది శరీరాన్ని నార్మల్ డెలివరీకి సిద్ధం చేస్తుంది. పాదాలు, చీలమండల వాపును తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. కటి కండరాల్ని చురుగ్గా ఉంచుతుంది. నిరంతరం నడవడం కష్టంగా అనిపిస్తే.. దానిని 2-3 భాగాలుగా విభజించవచ్చు. అయితే, సాధారణ వేగంతో నడిస్తే మంచిది.
గుర్తించుకోవాల్సిన విషయాలు
వాకింగ్ ప్రారంభించే ముందు లేదా సమయం పెంచే ముందు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.
మీకు తల తిరుగుతున్నట్టు లేదా ఊపిరి ఆడకపోవడం లేదా నొప్పిగా అనిపిస్తే వెంటనే ఆపండి.
మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. ఈ సమయంలో హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే వాకింగ్ చేసేటప్పుడు విరామాల్లో నీరు తాగండి.
సౌకర్యవంతమైన దుస్తులు, షూస్ ధరించండి.
నిపుణురాలు మంకీరత్ కౌర్ ప్రకారం నడవడం వల్ల ప్రెగ్నెన్సీ సౌకర్యవంతంగా ఉంటుంది. తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుందని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, మీకు ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa