ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు, టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇక, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గ్రేస్ హారిస్ (9) త్వరగా ఔటైనా, కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియా వోల్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా స్మృతి మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసింది. మరోవైపు జార్జియా వోల్ కూడా బాధ్యతాయుతంగా ఆడి 54 బంతుల్లో 14 ఫోర్లతో 79 పరుగులు సాధించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేశారు.విజయం ముంగిట నిలిచిన సమయంలో ఆర్సీబీ స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. వోల్, రిచా ఘోష్ (6), ఆ తర్వాత సెంచరీకి చేరువలో ఉన్న స్మృతి మంధాన కూడా ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, చివర్లో క్రీజులోకి వచ్చిన నదీన్ డి క్లర్క్ (7*), రాధా యాదవ్ (12*) ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివర్లో రాధా యాదవ్ ఫోర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఢిల్లీ బౌలర్లలో చినెల్ హెన్రీ రెండు వికెట్లు తీసింది.అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ జట్టులో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. లారా వోల్వార్డ్ట్ (25 బంతుల్లో 44) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్లు లిజెల్ లీ (37), షఫాలీ వర్మ (20) శుభారంభం అందించారు. చివర్లో చినెల్ హెన్రీ కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి స్కోరు బోర్డును 200 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది. ఆర్సీబీ బౌలర్లలో నలుగురు బౌలర్లు తలా ఒక వికెట్ పంచుకున్నారు. లారెన్ బెల్ పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఈ విజయంతో ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ చరిత్రలో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆర్సీబీ ఇంతకుముందు 2024 సీజన్ లో విజేతగా నిలిచింది. అప్పుడు కూడా ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైనే గెలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa