మన శరీరంలో ఫిల్టర్లలా పనిచేసే కిడ్నీల ఆరోగ్యం మనం తీసుకునే నీటి పరిమాణంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతుంటారు, మరికొందరు ఆరోగ్యానికి మంచిదని అతిగా తాగుతుంటారు. అయితే, ఈ రెండు పద్ధతులు కూడా కిడ్నీలకు మేలు చేయవు సదా కీడు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో, సరైన పరిమాణంలో నీటిని తీసుకోవడం వల్ల మాత్రమే కిడ్నీలు తమ విధులను సక్రమంగా నిర్వహించగలవు.
శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTIs) వంటివి వేధిస్తాయి. నీరు తక్కువైనప్పుడు రక్తంలోని వ్యర్థాలను బయటకు పంపడం కిడ్నీలకు కష్టతరమవుతుంది. ఇది కాలక్రమేణా కిడ్నీ పనితీరును మందగింపజేసి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది, కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.
అదే సమయంలో, 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నట్లుగా అతిగా నీరు తాగడం కూడా ప్రమాదకరమే. అవసరానికి మించి నీరు తీసుకుంటే కిడ్నీలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తంలోని సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు పడిపోతాయి. ఈ పరిస్థితి కేవలం కిడ్నీలనే కాకుండా, గుండె పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే అతిగా నీరు తాగి శరీర సమతుల్యతను దెబ్బతీసుకోకూడదు.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, ఒక సాధారణ వ్యక్తికి రోజుకు ఎంత నీరు అవసరమో నిర్ణీత కొలతలు ఉన్నాయి. సాధారణంగా మహిళలు రోజుకు కనీసం 2.2 లీటర్ల నీటిని, పురుషులు దాదాపు 3 లీటర్ల నీటిని తీసుకోవడం ఉత్తమం. వాతావరణ పరిస్థితులు మరియు మీ శారీరక శ్రమను బట్టి ఈ పరిమాణంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ నియమాలను పాటించడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa