ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ చనిపోయాడని తెలిసినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో నిరసన జ్వాలలు ఆగడం లేదు. అల్లర్లు, భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోయలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ వారాంతం వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సకీనా ఇటూ అధికారికంగా ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
అట్టుడుకుతున్న లోయ.. రాళ్ల వర్షం
ఖమేనీ చనిపోయినట్లు ఆదివారం రోజు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం నాడు నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఐదుగురు పోలీసులు సహా కనీసం 12 మందికి గాయాలు అయ్యాయి. పౌర జీవనానికి విఘాతం కలిగిస్తే సహించేది లేదని, రాళ్లు రువ్వే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
ఈక్రమంలోనే శ్రీనగర్ ప్రధాన కేంద్రమైన లాల్ చౌక్ గత మూడు రోజులుగా పోలీసుల దిగ్బంధంలోనే ఉంది. ఆదివారం ఇక్కడే వేలాది మంది నిరసనకారులు గుమిగూడటంతో.. ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని ప్రవేశ మార్గాలను టీన్ షీట్లు, ముళ్ల కంచెలతో మూసివేశారు. లోయలో పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. హోం శాఖ ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిస్థితుల తీవ్రతను బట్టి వీటిని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.
అదుపులో ఉన్నా.. ఆందోళనగానే!
మంగళవారం నాడు పెద్దగా హింసాత్మక ఘటనలు నమోదు కాకపోయినప్పటికీ.. అంతర్లీనంగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. విదేశీ పరిణామాల ప్రభావం కాశ్మీర్ లోయపై పడటం భద్రతా దళాలకు సవాలుగా మారింది. పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ స్థితి పునరుద్ధరించే వరకు విద్యాసంస్థలు తెరవడం శ్రేయస్కరం కాదని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa