ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత ఉద్ధృతం.. ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

international |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:24 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఐదో రోజు మరింత ఉద్ధృతమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించగా... అటు ఇరాన్ సైతం అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ నాయకత్వం, భద్రతా యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఇరాన్ అధికారిక మీడియా కార్యాలయంపై దాడి జరిగినట్టు స్థానికులు తెలిపారు. కానీ, ఇజ్రాయెల్, అమెరికా ప్రాంతీయ స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో ఇరాన్ ప్రతిస్పందించింది.


మరోవైపు, యుద్ధం తీవ్రతరం కావడంతో ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ ప్రభుత్వం చివరి క్షణంలో వాయిదా వేసింది. ఆయన అత్యక్రియలు బుదవారం నిర్వహించాలని భావించినా.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటన చేస్తామని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది.


యుద్ధం విమానాలు శబ్దం వినిపిస్తున్న నేపథ్యంలో.. టెహ్రాన్‌లో చాలా మంది ఉండాలా? లేదా? వెళ్లిపోవాలా అనే దానిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం F-35 యుద్ధ విమానాల్లో ఒకటి.. టెహ్రాన్ నుంచి వచ్చిన యాక్-130ను కూల్చివేసినట్టు తెలిపింది. జెరూసలేం చుట్టూ పేలుళ్లు సంభవించాయని నివేదించిన తర్వాత. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్టు తెలిపింది.


తూర్పు, మధ్యధరా ప్రాంతంలోని వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని.. సిరియా, ఇరాక్‌లను దాటి టర్కీ దిశగా వస్తుండగా అడ్డుకున్నట్టు టర్కిష్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య విస్తరిస్తున్న వివాదంలోకి నాటో సభ్యదేశమైన టర్కీని లాగడం ఇదే మొదటిసారి.


మరోవైపు, ఇరాన్‌లో అణు కేంద్రాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అంతర్జాతీయ అణు శక్తి సంస్థ కీలక ప్రకటన చేసింది. అందుబాటులో ఉన్న శాటిలైట్ చిత్రాలను విశ్లేషించామని, అణు పదార్థాలు ఉన్న స్థావరాలకు ఎటువంటి నష్టం జరగలేదని, అందువల్ల ఈ సమయంలో రేడియేషన్ విడుదల ముప్పు లేదని తెలిపింది.


‘‘ఇస్ఫాహాన్ అణు కేంద్రం సమీపంలో, రెండు భవనాల వద్ద నష్టం కనిపిస్తుంది. ప్రవేశ ద్వారాల వద్ద గతంలో జరిగిన నష్టం తర్వాత నతాంజ్ వద్ద అదనపు ప్రభావం కనిపించలేదు.. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంతో సహా ఇతర అణు ప్రదేశాలపై ఎటువంటి ప్రభావం లేదు’’ అని ఐఏఈఏ వెల్లడించింది. అయితే, టెహ్రాన్ శివారులోని ఓ అణు స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa