ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెతన్యాహుతో చర్చించాకే.. ఇరాన్‌‌తో యుద్ధం ఆపడంపై నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:43 PM

పశ్చిమాసియాలో యుద్ధం 10వ రోజుకు చేరుకున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత వివాదాస్పద, శక్తివంతమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఇరాన్‌పై యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తానని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ నియామకంపై స్పందిస్తూ.. అమెరికా ఆమోదం లేనిదే ఇరాన్‌లో ఏ నాయకుడూ ఎక్కువ కాలం అధికార బాధ్యతలు చేపట్టలేరని ఆయన హెచ్చరించారు.


నెతన్యాహుతో ఉమ్మడి నిర్ణయం..


యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. "ఇది పరస్పర నిర్ణయం. నేను, నెతన్యాహు నిరంతరం మాట్లాడుకుంటున్నాం. సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం. మేము లేకపోతే ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌ను నాశనం చేసేది" అని ఇజ్రాయెల్ మీడియా సంస్థకు తెలిపారు. అమెరికా వైమానిక దాడులు ఆపినా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.


ప్రస్తుతం ఇరాన్ తన పొరుగు దేశాలైన యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేస్తోంది. యుద్ధం 10వ రోజుకు చేరినా.. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ దిశగా ఎటువంటి అడుగులు పడకపోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సందర్భంగానే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్లు చేశారు.


ఖమేనీ వారసుడిగా మోజ్తబా.. ట్రంప్ రియాక్షన్ ఏంటి?


ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా నియమిస్తున్నట్లు ఆ దేశ సీనియర్ మతగురువులు సోమవారం ధృవీకరించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ చరిత్రలో ఈ అత్యున్నత పదవి మారడం ఇది మూడవసారి మాత్రమే.


అయితే ఈ నియామకంపై ట్రంప్ స్పందిస్తూ.. "కొత్త నాయకుడు ఎవరైనా మా ఆమోదం పొందాల్సిందే. లేదంటే ఆయన పదవిలో ఎక్కువ కాలం ఉండలేరు. ప్రతి ఐదు పదేళ్లకు ఒకసారి మేము యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూస్తాం. ఇరాన్ అణు ఆయుధాన్ని పొందే పరిస్థితిని ఎప్పటికీ రానివ్వం" అని ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa