ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఎడిట్ ఫీచర్ కూడా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ జాన్ మాన్‌చున్ వాంగ్ ఈ ఫీచర్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశాన్ని అందరితో షేర్ చేసుకున్నారు. ఆమె ప్రకారం, ఎడిట్ ఫీచర్ సాయంతో ఒక ట్వీట్‌లోని టెక్స్ట్‌ని ఎడిట్ చేసి అదే ట్వీట్‌ని అప్‌డేట్ చేయడం కుదరదు. ఒక ట్వీట్‌ని ఎడిట్ చేసినప్పుడు ఆ ట్వీట్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
దానికి బదులుగా ఎడిట్ చేసిన టెక్స్ట్‌తో ఒక కొత్త ట్వీట్ దానంతట అదే క్రియేట్ అవుతుంది. అలాగే ఎడిట్ చేయక ముందు ఉన్న ట్వీట్ కూడా ట్వీట్ రివిజన్ హిస్టరీ లాగా కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఇలా ఎడిట్ హిస్టరీని కూడా చూపించేందుకు ట్విట్టర్ రెడీ అవుతుందని తెలుస్తోంది.
"ట్వీట్‌ను ఎడిట్ చేయడానికి ట్విట్టర్ పెద్దగా ఎలాంటి మార్పు లేని ఓ అప్రోచ్ ఫాలో అవుతోంది. దీని ప్రకారం, ఎడిట్ ఫీచర్ అనేది ట్వీట్‌లోని ట్వీట్ టెక్స్ట్‌ను మార్చదు. మొదటగా ఎడిట్ చేసిన ట్వీట్ అలాగే ఉంటుంది. ఏదైనా ట్వీట్‌ను ఎడిట్ చేస్తే ఆ ట్వీట్ ఎడిటెడ్ టెక్స్ట్‌తో అప్‌డేట్ అవ్వదు. అందుకు బదులుగా ఎడిటెడ్ టెక్స్ట్‌తో ఆ ఓల్డ్ ట్వీట్ మళ్లీ కొత్త ట్వీట్‌గా కొత్త ఐడీతో క్రియేట్ అవుతుంది. ఇది ముందుగా చేసిన ఓల్డ్ ట్వీట్‌ల లిస్టుతో యాడ్ అవుతుంది" అని మాన్‌చున్ వాంగ్ ఒక ట్వీట్‌లో వెల్లడించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకరు ట్వీట్‌ను ఎడిట్ చేసినప్పుడు, ట్విట్టర్ దాని ప్రీవియస్ వెర్షన్లను చూపిస్తూనే పూర్తిగా కొత్త ట్వీట్‌ను క్రియేట్ చేస్తుంది.
అయితే మాన్‌చున్ వాంగ్ మెన్షన్ చేసిన "ఓల్డ్ ట్వీట్‌ల లిస్ట్" అంటే ఏంటనే దానిపై క్లారిటీ లేదు. ఫేస్‌బుక్‌లో లాగా ట్విట్టర్‌లో కూడా ఒక ట్వీట్ చేసిన తర్వాత దాని కింద వ్యూ ఎడిట్ హిస్టరీ లాంటిది కనిపించవచ్చని తెలుస్తోంది. ఈ ట్వీట్ హిస్టరీ ఆ యూజర్లకు మాత్రమే కనిపిస్తుందా లేదా ఇతరులు చూసేలా పబ్లిక్‌గా ఉంటుందా అనేది ఇంకా తెలియరాలేదు. గతంలో ఫలానా యూజర్ ఏం ట్వీట్ చేశారో, మళ్లీ దానిని ఎలా మార్చారో అందరికీ తెలిసేలా ట్విట్టర్ ఎడిట్ ఫీచర్ ఉండొచ్చని కొన్ని టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.
యాప్ రీసెర్చర్ అలెశాండ్రో పలుజ్జీ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, ట్వీట్ రైట్ కార్నర్ టాప్‌లో త్రీ-డాట్ మెనూలో ఎడిట్ ట్వీట్ ఫీచర్ కనిపిస్తుంది. ఎడిట్ ట్వీట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ట్వీట్‌లోని టెక్స్ట్ ఎడిట్ చేయొచ్చు. అవసరమైన మార్పులు చేసి 'అప్‌డేట్'పై నొక్కాలి. ఈ స్క్రీన్‌షాట్ ట్వీట్ హిస్టరీ గురించి ఎలాంటి ఇన్ఫో రివీల్ చేయకపోవడం గమనార్హం. ట్వీట్ హిస్టరీ గురించి ట్విట్టర్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.