అందరికీ తమ వారి జనన, మరణ ధ్రువపత్రాలు అవసరం పడుతుంటాయి. వాటి కోసం ఆసుపత్రుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. దరఖాస్తు ఫారం సరిగ్గా లేదనో, అవసరమైన పత్రాలు సమర్పించలేదనో కుంటి సాకులతో దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థనలను ప్రభుత్వ కార్యాలయాల్లో తిరస్కరిస్తుంటారు. ఈ పరిస్థితి ఇక కనిపించదు. వివిధ కార్యాలయాలకు తిరగకుండానే దరఖాస్తు చేసుకునే వారికి వారి స్వగ్రామాల్లోనే ఈ సౌకర్యం అందనుంది. ఇందు కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్ రూపొందించింది.
ప్రజలు జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేయకుండానే అవి మంజూరు చేసేలా కొత్త యాప్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్ ఉపయోగించే విధానంపై గ్రామ పంచాయతీ, పురపాలికల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి, శ్మశాన వాటికల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. వారి మొబైల్ నంబర్‌లకు యాప్ వినియోగించుకునేందుకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందజేశారు. ఇక ధ్రువపత్రాలు కావాల్సిన వారు ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఆస్పత్రులు, వైకుంఠధామాల దగ్గర ఉండి వివరాలు నమోదు చేయించుకోవాలి. వివరాలు నమోదు చేయగానే దరఖాస్తుదారుడి మొబైల్ నంబరుకు తాత్కాలిక సర్టిఫికెట్ వస్తుంది. ఆ తర్వాత దానిని చూపించి 'మీసేవా' కేంద్రాలలో ఒరిజినల్ సర్టిఫికెట్‌ను పొందొచ్చు. దీంతో దళారుల ప్రమేయం లేకుండానే అత్యంత సులువుగా జనన, మరణ ధ్రువపత్రాలను దరఖాస్తుదారులు పొందే వీలుంది.