ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూ కాలర్ కీలక నిర్ణయం తీసుకుంది. మారిన నిబంధనల నేపథ్యంలో యూజర్లకు ఫ్రీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ తొలగించింది. మే 11 నుంచి ఈ నిర్ణయం అమలు అవుతుందని పేర్కొంది. గూగుల్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయడానికి గూగుల్ చర్యలు తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ ఆప్షన్ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో మే 11 నుంచి కాల్ రికార్డింగ్ యాప్‌లు కనిపించవు. అంతేకాకుండా ఆండ్రాయిడ్‌లో ఇప్పటికే ఇన్‌బిల్ట్ అయిన యాప్‌లలో కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా మాయం అవుతుంది.
ఇందులో భాగంగానే ట్రూ కాలర్‌లో కూడా కాల్ రికార్డింగ్ ఆప్షన్‌ను తొలగించనున్నారు. యూజర్ల గోప్యత, భద్రత అంశాలకు గూగుల్ ప్రాధాన్యత ఇస్తుంది. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కాల్ రికార్డింగ్ వల్ల అనర్థాలు జరుగుతున్నాయని గ్రహించింది. కాల్ రికార్డింగ్ కోసం యాప్‌లకు గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐ అవసరం ఏర్పడుతుంది. ఇక నుంచి గూగుల్ ఏపీఐ యాక్సెసబిలిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆయా యాప్‌ల ద్వారా కాల్ రికార్డింగ్ సాధ్యపడదు. ఇప్పటికే శాంసంగ్, ఎంఐ, వివో, హానర్ వంటి ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం లేని వారికి మాత్రమే కాల్ రికార్డింగ్‌కు కొంత సమస్య ఎదురుకానుంది.