ఎర్రగుంట్ల పురపాలిక పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డు వైజంక్షన్ సమీపంలో గల జగనన్న లే అవుట్లో కొనసాగుతున్న గృహ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు సంతృప్తిని వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమీషనర్ పగడాల జగన్నాధన్ను మెచ్చుకున్న ఘటన కడప సభాభవనంలో చోటుచేసుకుంది. ఈ లేఅవుట్లో సుమారు వెయ్యి వరకు పక్కా గృహాల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.
ఇందులో 300 గృహాలకు సంబందించి బేస్మట్టం పనులు పూర్తి అయ్యాయి. మరో 60 గృహాల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 50 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నిరంతరంగా వీటి పనులు కొనసాగుతున్నాయి. గతంలో నిర్మాణం పనులు నెమ్మదిగాసాగేవి. తరచూ ఉన్నతాధికారులు ఇక్కడి క్షేత్రస్థాయి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే క్రమేపీ నిర్మాణం పనుల్లో వేగం పుంజుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కడప సభాభవన్ లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఎర్రగుంట్ల పురపాలిక గృహనిర్మా ణాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కలెక్టర్ సంతృప్తిపై ఇక్కడి క్షేత్రస్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది, గృహ నిర్మాణాల బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తూ గృహ నిర్మాణ పనుల
పురోగతిలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ జగన్నాధ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేయడం తమకు ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొంటూ సకాలంలో గృహనిర్మాణ పనులు పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.