బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో టీమిండియా స్టార్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి 24-22, 15-21, 21-14తో జపాన్‌కు చెందిన యుగో కొబయాషి, టకురో హోకీ జంటను ఓడించారు. ఈ నెల ప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న ఈ జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తమ ఫామ్‌ను తిరుగులేకుండా కొనసాగిస్తోంది. వీరిద్దరూ జపాన్‌కు చెందిన ప్రపంచ నంబర్ 2 జోడీపై విజయం సాధించారంటే వీరి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే తొలి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. ఇరు వైపులా విజయం దోబూచులాడింది. స్కోర్‌లైన్ 22-22గా ఉన్నప్పుడు, మిడ్‌కోర్ట్ నుండి చిరాగ్ క్రాస్ ఆడి పాయింట్ సాధించడంతో భారత్ మొదటి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లో వెనుదిరిగారు. స్కోర్‌కార్డు 11-9తో ఉండగా, ఇంకా కోలుకునే అవకాశాలు ఉండగా.. జపాన్ జోడీ ఎటాకింగ్ గేమ్ ఆడి విజయం సాధించింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. భారత్ మూడో గేమ్ మ్యాచ్ డిసైడర్. మూడో గేమ్‌లో సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ గేమ్‌లో విజయం సాధించడం ద్వారా భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. అలా ఇద్దరూ చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.