రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట మండలం శ్రీరాములు పేట సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహములో విద్యార్థులను వార్డెన్ చితకబాదారు. వసతి గృహంలో కరెంటు పోవడంతో పిల్లలు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టడంతో వార్డెన్ హరికృష్ణ క్షణిక ఆవేశములో చేతిలో ఉన్న షటిల్ బ్యాటుతో పిల్లలను చితకబాదాడు. కొంతమంది పిల్లలకి చేతుల మీద వాతలు పడటం, మణికట్టు మీద గట్టిగా దెబ్బ తగలడం, తల మీద బొప్పి కట్టడం జరిగింది.
వసతి గృహంలో జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ బాబుల్ రెడ్డి పిల్లలను పరామర్శించారు. పిల్లలను కొట్టిన వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఈ ఘటన విషయాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిక అధికారి జాకీర్ హుస్సేన్, ఎస్ డబ్ల్యూ శ్రీనివాసమూర్తి, ఎంఈఓ రంగనాథం మాట్లాడుతూ ఈ విధంగా పిల్లలను కొట్టడం సరైనటువంటి పద్ధతి కాదని పిల్లలను కొట్టే హక్కు లేదని తెలిపారు. ఇకమీదట ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదని వార్డన్ ను హెచ్చరించారు.