టీడీపీ, వైసీపీ మధ‌్య నిత్యం సెటైరిక్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికర సెటైర్ కు టీడీపీ తెరలేపింది. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసిన జస్టిస్ ఎన్వీ రమణ చర్యను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వాగతిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. కోర్టు విచారణల లైవ్ స్ట్రీమింగ్ ఆహ్వానించదగ్గ పరిణామమని, ఈ చర్యతో మరింత పారదర్శకత సాధ్యమని కూడా సాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ట్విట్‌ను చూసినంతనే ఏపీలో విపక్షం టీడీపీ సెటైరికల్‌గా స్పందించింది. సాయిరెడ్డి ట్వీట్‌ను నైస్ అంటూ పేర్కొన్న టీడీపీ... కోర్టు విచారణల లైవ్ స్ట్రీమింగ్‌లో సాయిరెడ్డితో పాటు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా త్వరలోనే కనిపిస్తారని తెలిపింది. రూ.43 వేల కోట్ల ఆక్రమార్జన, మనీ ల్యాండరింగ్ వ్యవహారాల్లో సాయిరెడ్డి, జగన్‌లు ఇద్దరూ కోర్టు విచారణల లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపించడం తథ్యమని టీడీపీ తెలిపింది.