అందరూ ఊహించినట్టుగానే మన దాయాది దేశమైన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. తద్వారా గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. ఇదిలావుంటే భారత్ ఆసియా కప్ లో తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 31న హాంకాంగ్ జట్టుతో ఆడనుంది.
పాక్ నిర్దేశించిన 148 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలోనే ఛేదించింది. హార్దిక్ పాండ్యా చిచ్చరపిడుగులా చెలరేగాడు. పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 35 పరుగులు చేశాడు. అంతకుముందు, విరాట్ కోహ్లీ 35 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. చివర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోగా... రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా జోడీ ఆత్మవిశ్వాసంతో ఆడి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది.
ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా, స్పిన్నర్ నవాజ్ బౌలింగ్ లో తొలి బంతికే జడేజా అవుటయ్యాడు. అయితే, హార్దిక్ పాండ్యా ఓ ఫ్లాట్ సిక్స్ తో మ్యాచ్ ను ముగించి టీమిండియా శిబిరంలో ఆనందోత్సాహాలు నింపాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, మహ్మద్ నవాజ్ 3 వికెట్లు తీశారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులు ఏమేం ఐటమ్స్ ఉండాలని కోరుకుంటారో అన్నీ లభించిన మ్యాచ్ ఇది. రోమాంఛక వినోదం, ఉత్కంఠ, క్రికెటింగ్ నైపుణ్యాలు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభ, చివరి ఓవర్ వరకు కొదమసింహాల్లా తలపడిన ఆటగాళ్ల పోరాట పటిమతో దాయాదుల సమరం తన ప్రత్యేకతను చాటింది.