కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం తనకు లేదని, తాను బీజేపీలోనే కొనసాగుతానని గడ్కరీ చెప్పారు. కాంగ్రెస్ లో చేరాలని తన స్నేహితుడు, దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కార్ తనను గతంలో కోరారని... అప్పుడు, బావిలో దూకి చచ్చిపోతానే కానీ తాను కాంగ్రెస్ లో మాత్రం చేరనని ఆయనకు చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చవని చెప్పారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నాగపూర్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలి కాలంలో పార్టీ అధిష్ఠానంపై కాస్త అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అత్యున్నత కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా ఆయనను తొలగించడం అందరినీ షాక్ కు గురి చేసింది. మరోవైపు, ఇటీవల కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని గడ్కరీ కొట్టిపడేశారు.