అమెరికాలో సైతం మతం చిచ్చు రాజుకొంది. వివరాలలోకి వెళ్లితే...వాళ్లిద్దరూ భారతీయ అమెరికన్లు. వారిలో ఒకరు సిక్కు. మరొకరు హిందువు. హిందువును పట్టుకుని ‘డర్టీ హిందూ’ అంటూ సిక్కు మతస్థుడు నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇటీవలే డల్లాస్ లో భారతీయ మహిళల పట్ల ఓ మెక్సికన్ మహిళ చూపిన జాతి వివక్ష ఘటన మర్చిపోక ముందే తాజా ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆగస్ట్ 21న కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో ఈ ఘటన జరిగింది. 37 ఏళ్ల తేజిందర్ సింగ్ అనే వ్యక్తి.. కృష్ణన్ జయరామన్ ను అతి దారుణంగా దూషించాడు. జయరామన్ పై ఉమ్ము వేసి, అతి దారుణంగా దూషించాడు. ‘‘హిందువులు అసహ్యకరమైన వారు. గోమూత్రం తాగుతారు. సిగ్గు పడాలి’’ అంటూ విచక్షణారహితంగా మాట్లాడాడు. అంతేకాదు తన చేతి కండలను చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశాడు. తాను ఎదురుతిరిగితే దాడి చేసే ప్రమాదం ఉందని భావించిన జయరామన్ పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే వచ్చిన ఫ్రీమాంట్ పోలీసులు తేజిందర్ సింగ్ పై పౌర హక్కుల ఉల్లంఘన నేరాన్ని మోపుతూ కేసు నమోదు చేశారు.
అసహ్యకరమైన, ద్వేషపూరిత నేరాలను తాము సీరియస్ గా తీసుకుంటామని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సియాన్ వాషింగ్టన్ ప్రకటన విడుదల చేశారు. అన్ని మతాలకు చెందిన వారిని రక్షించేందుకే తామున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకరిపట్ల మరొకరు గౌరవభావంతో మసలుకోవాలని సూచించారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన యూఎస్ హౌస్ రిప్రజెంటేటివ్ రోహిత్ ఖన్నా ఈ ఘటనను ఖండించారు.