ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలోని అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూప్ హాజరయ్యారు. పార్టీ శ్రేణులను కలిసేందుకు ఉత్సాహంగా కనిపించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన కొద్దిసేపటికే విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. విశ్వరూప్ పరిస్థితిని గమనించిన పార్టీ శ్రేణులు వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశ్వరూప్ అస్వస్థతకు గల కారణాలు తెలియరాలేదు.