ఐటీ కమిటీ రూమ్‌ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ల్లోకి కాషాయ పార్టీ గూండాయిజం చొరబడిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్రా మరోసారి బీజేపీపై .. తీవ్రమైన విమర్శలు చేశారు. . ఈ మేరకు బీజేపీ నేతల చర్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో జరిగిన సంఘటనను ఉద్దేశించి మోయిత్రా వరస ట్వీట్‌లలో బీజేపీపై విమర్శలు గుప్పించారు.
"గూండారాజ్ కార్యకలాపాలు ఐటీ కమిటీ గది నుంచి ఏటీసీ కంట్రోల్ రూమ్‌కు మారాయని గుర్తించడం చాలా సంతోషం." అని పేర్కొన్నారు. అంతేకాదు చార్టర్డ్ విమానాలను వాడుతూ విపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చుతుందని తనకు తెలుసునని.. ఆ లిస్ట్‌లో ఇప్పుడు ఏటీసీ కంట్రోల్ రూమ్‌లు కూడా చేరాయా..? అని అడిగారు. " ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ చార్టర్డ్ విమానాలను వినియోగిస్తుందని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు ATC కంట్రోల్ రూమ్‌లోకి దూసుకెళ్లడం కూడా ఇందులో ఉందా..?." అని ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించారు. పైగా తన ట్వీట్‌లో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, ఎంపీ కార్తీ చిదంబరాన్ని ట్యాగ్ చేశారు.
ఇటీవల జార్ఖండ్‌లోని దియోఘఢ్ విమానాశ్రయంలో రూల్స్‌కు వ్యతిరేకంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి చేశారనే ఆరోపణతో బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీపై కేసు నమోదైంది. ఈ మేరకు బీజేపీ ఎంపీలునిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎయిర్ పోర్ట్ డీఎస్‌పీ సుమన్ వారిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇతరుల ప్రాణాలకు, వారి భద్రతకు అపాయం కలిగించారని, నిబంధనలు అతిక్రమించారని వారిపై అభియోగాలు మోపారు. ఎలాంటి అనుమతి లేకుండానే నాయకులు ఏటీసీలోకి ప్రవేశించారని, తమ చార్టర్‌కు క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.