మనదేశంలో కొన్నింటి సేవలు సుదూర ప్రయాణ ఖర్చుల కంటే ఎక్కువ అని చెబితే నమ్ముతారా....? నమ్మక తప్పదు మరి. మన దేశంలో జీఎస్టీ ఎఫెక్ట్ మామూలుగా లేదు. పాలు, పెరుగు, పప్పులు, ఉప్పు ఇలా అన్నింటిపైన జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. ఈ జీఎస్టీ దెబ్బతో సామాన్యుల బతుకు భారమైపోయింది. పన్నుల వడ్డనతో ప్రజల నడ్డి విరుగుతుంది. ఈ నేపథ్యంలో మరో దిమ్మతిరిగే విషయం తెలిసింది. ఆఖరికి టాయిలెట్‌కు వెళ్లినా కూడా.. జీఎస్టీ చెల్లించాలట. రెండు రోజుల క్రితం ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో వాష్ రూమ్‌ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు పన్ను చెల్లించాల్సి వచ్చింది.
కేవలం ఐదు నిమిషాల వాష్‌రూమ్‌ను వినియోగించుకున్నందుకు ఇద్దరు జీఎస్టీతో రూ.224 చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై ఫిర్యాదు చేశారు. విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో దిగారు. వారిని గైడ్ శ్రీవాస్తవ రీసివ్ చేసుకున్నారు. బ్రిటిష్ ఎంబసీ నుంచి వచ్చిన వారిద్దరూ.. స్టేషన్‌లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. వాష్ రూమ్‌కు వెళ్తామని గైడ్‌కు చెప్పారు. వెంటనే శ్రీవాస్తవ వారిని స్టేషన్‌లో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి తీసుకెళ్లారు.
వాళ్లు కేవలం ఐదు నిమిషాలు వాష్‌రూమ్‌ను ఉపయోగించుకున్నారు. వారు ఫ్రెష్ అయి.. బయటకు వచ్చిన వెంటనే అక్కడ రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు పే చేయాలని చెప్పింది. దాంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక్కొక్కరి బిల్లు రూ. 100లు దానిపై జీఎస్టీ రూ. 12. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట ముగ్గురు ఒప్పుకోలేదు. కానీ చివరికి చెల్లించాల్సి వచ్చింది.
దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్‌లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ స్టేషన్‌లో వాష్‌రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒక పక్క అతిథి దేవో భవ అని బోర్డులు పెడుతుంటుందని, కానీ విదేశాల నుంచి వచ్చిన వారి దగ్గర ఇలా డబ్బులు వసూలు చేస్తే .. పర్యాటకులు ఎలా ఫీల్ అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు. మరోవైపు దీనిపై ఐఆర్‌సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి ప్రవేశానికి ప్రత్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పారు. ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఇకపై టాయిలెట్‌కు వెళ్లినా పన్ను చెల్లించాలా..? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.