దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణం ఇదే కావడం గమనార్హం. దాదాపు రూ.200 కోట్ల ఈ కుంభకోణంలో బస్ కండక్టర్, ఆటోరిక్షా డ్రైవర్, ఫ్యాక్టరీ వర్కర్, మాజీ కుక్ సహా ఓ ఉపాధ్యాయుడు కీలక పాత్రధారులు కావడం మరో విశేషం. మధ్యప్రదేశ్‌లో బయటపడ్డ ‘వ్యాపం’ కుంభకోణంతో దీనిని పోల్చుతున్నారు. 2013లో వెలుగుచూసిన వ్యాపం.. దేశంలోనే అతిపెద్ద పోటీ పరీక్షల కుంభకోణంగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే ఇప్పటి వరకూ యూకేఎస్ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో 32 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా 200 మంది అభ్యర్థులకు ఒక్కో పేపర్ రూ.10-15 లక్షల చొప్పున అమ్మినట్టు తేలింది. పేపర్ కాపీని లక్నోకు చెందిన టెక్-సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థ యజమాని, సిబ్బంది లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దానితో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది.
హకమ్ సింగ్, అతడి సన్నిహితుడైన యూపీకి చెందిన చీటింగ్ ముఠా సభ్యుడు కేంద్రపాల్, చందన్ మన్రాల్, మనోజ్ జోషి, జగదీష్ గోస్వామిలను ఈ కుంభకోణంలో కీలక సూత్రధారులుగా గుర్తించారు. వీరిలో చాలా మంది కనీసం రూ.50 కోట్ల విలువైన అక్రమాస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం.
ఉత్తరకాశీ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు హకమ్ సింగ్‌ను ఆగస్టు 14న పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఉత్తరకాశీ జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్న హకమ్‌ను పోలీసుల అరెస్ట్ తర్వాత బీజేపీ బహిష్కరించింది. యూపీలోని ధామ్‌పూర్‌లో ఓ ఇంటికి అద్దెకు తీసుకున్న హకమ్.. పరీక్షకు ముందు రోజు అభ్యర్థులను అక్కడకు తీసుకొచ్చి లీక్ చేసిన ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాయించినట్టు తేలింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.15 లక్షల వసూలు చేసినట్టు గుర్తించారు.
ఆగస్టు 26 అరెస్టయిన మరో నిందితుడు కేంద్రపాల్ ఉత్తరాఖండ్‌తో పాటు యూపీలోని పలు పోటీ పరీక్షల పేపర్లు లీకేజ్‌లో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. 2011లో ఓ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా హకమ్‌తో కేంద్రపాల్‌కు పరిచయం ఏర్పడిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. లీకేజ్ మాఫియాలో చేరడానికి ముందు తొలుత 96లో ఆటోరిక్షా డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన కేంద్రపాల్.. తర్వాత ధామ్‌పూర్‌లోని ఓ గార్మెంట్స్ కంపెనీలో పనిచేశాడు. కొద్ది రోజుల అనంతరం సొంతంగా వస్త్ర వ్యాపారం చేపట్టాడు. అతడి పేరుతో ధామ్‌పూర్‌లో 3.3 ఎకరాల భూమి, విలాసవంతమైన ఇల్లు సహా ఉత్తరకాశీలో హకమ్‌తో కలిసి ఓ రిసార్ట్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మరో నిందితుడు చందన్ మన్రాల్‌ను కేంద్రపాల్ 2012లో కలిశాడు. రామ్‌నగర్‌కు చెందిన చందన్ వద్ద కనీసం రూ.100 కోట్లకుపైగా విలువైన ఆస్తులున్నట్టు గుర్తించారు. దాదాపు 30 ఏళ్ల కిందట బేతల్‌ఘాట్- రామ్‌నగర్ మార్గంలో బస్సు కండక్టర్‌గా చందన్ ప్రయాణం మొదలయ్యింది. కొన్నాళ్ల తర్వాత స్నేహితులు, బంధువుల సహకారంతో ఓ బస్సు కొనుగోలు చేయడంతో దశ తిరిగింది. ఏకంగా 19 బస్సులకు యజమాని అయ్యాడు. అనంతరం కుమాన్ రీజియన్‌లో ట్రాన్స్‌ఫోర్ట్ ఏజెన్సీ ప్రారంభించాడు. చీటింగ్ మాఫియాను కలిసిన తర్వాత చందన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. 25 ఎకరాల విస్తీర్ణంలో స్టోన్ క్రషర్‌ను నడుపుతున్నాడు. అంతేకాదు, తన ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ద్వారా 30 వాహనాలను వివిధ ప్రభుత్వ విభాగాలకు అద్దెకు నడుపుతున్నాడు.
అల్మోరాకు చెందిన ఏ22 జగదీశ్ గోస్వామితో కేంద్రపాల్‌కు 2019లో పరిచయం ఏర్పడింది. బాగేశ్వర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న గోస్వామి ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ జానపద గాయకుడు గోపాల్ బాబు గోస్వామి కుమారుడు. కరీనా కపూర్ నటించిన జబ్ ఉయ్ మెట్ సహా పలు బాలీవుడ్ సినిమాల్లో గోపాల్ తన గాత్రాన్ని వినిపించారు. తాను పనిచేసే ప్రాంతంలోని అభ్యర్థులను సమీకరించి వారికి పరీక్ష ముందు రోజు లీకయిన పేపర్‌కు సమాధానాలు రాయించాడు.
అల్మోరాకు చెందిన మరో నిందితుడు మనోజ్ జోషి గతంలో ప్రాంతీయ రక్షక్ దళ్‌లో జవాన్‌గా పనిచేశాడు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా 2018లో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఉద్యోగంలో చేరడానికి ముందు 12 ఏళ్లపాటు లక్నోలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసిన జోషి.. యూకేఎస్ఎస్‌సీ ద్వారా జవాన్‌గా ఎంపికయ్యాడు. లీకైన ప్రశ్నపత్రాలతో తన కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి జోషి సహాయపడినట్లు అధికారులు తెలిపారు.