తరాలు మారుతున్నా మదిలో గుడికట్టుకొన్న కుల అహంకారం మాత్రం పోవడంలేదు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మరో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బాలికల పట్ల ఓ వంట మనిషి అమానుషంగా ప్రవర్తించాడు. ప్రభుత్వ పాఠశాలలో వారి చేతులతో వడ్డించిన ఆహారాన్ని విసిరిగొట్టాడు. ఇతర విద్యార్థులు తినకుండా చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది ఉదయపూర్‌లోని గోగుండా బ్లాక్‌లోని భరోడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలికల ఫిర్యాదు మేరకు పోలీసులు వంట మనిషిని అరెస్ట్ చేశారు.
బరోడిలోని గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని లాల్‌రామ్ గుర్జార్ అనే వ్యక్తి తయారు చేస్తున్నాడు. అయితే తను చేసే వంటను ప్రతి రోజు స్కూల్లో అగ్రవర్ణాల విద్యార్థులే వడ్డించే వారు. అయితే వారు సరిగ్గా వడ్డించడం లేదని టీచర్‌కు తెలియడంతో.. శుక్రవారం ఓ ఇద్దరు దళిత బాలికలకు ఆ బాధ్యతను అప్పగించారు. ఈ మార్పు ఆ వంట మాస్టర్ లాల్‌రామ్ గుర్జార్‌కు ఏ మాత్రం నచ్చలేదు. దళిత అమ్మాయిలని వడ్డించవద్దని చెప్పాడు. అయినా ఆయన మాట వినకుండా బాలికలు వడ్డించడంతో ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో బాలికలు వడ్డించగానే.. ప్లేట్లలో ఉన్న భోజనాన్ని వెంటనే విసిరేయాలని ఇతర విద్యార్థులకు సూచించాడు. అంతేకాదు వారు వడ్డించిన భోజనాన్ని అతను విసిరిగొట్టాడు.
దాంతో ఆ దళిత బాలికలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న వారు లాల్‌రామ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కుక్‌ని అదుపులోకి తీసుకున్నారు. "భరోడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డించిన విద్యార్థులను భోజనం చేయనివ్వనందుకు మేము ఒక కుక్‌ని అరెస్ట్ చేశాం." అని కేసు దర్యాప్తు చేస్తున్న డిప్యూటీ ఎస్పీ భూపేంద్ర సింగ్ తెలిపారు. తమ ప్రాథమిక విచారణలో వంట మనిషిపై వచ్చిన ఆరోపణ నిజమని తేలిందని, అందుకే అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు.
పాఠశాలలో శుక్రవారం తాము మధ్యాహ్నం అందరికి దాల్, చపాతీలు వడ్డించే ముందు.. తాము తక్కువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులమని, వడ్డించవద్దని లాలూరాం గుర్జార్ చెప్పారని బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వంటవాడు ఆహారాన్ని కూడా పారేశాడని వెల్లడించారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్, మధ్యాహ్న భోజన ఇంచార్జ్ శివలాల్ శర్మ కూడా స్పందించారు. వంటవాడి సంకుచిత ఆలోచన కారణంగా ఈ విషయం తీవ్రమైందని, పాఠశాలలో ఎలాంటి వివక్షకు తావు లేదని చెప్పారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో స్కూల్లో మధ్యాహ్న భోజనంపై ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. కాగా గత కొన్ని రోజుల క్రితమే రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణమైన విషయం చోటుచేసుకుంది. తన పాత్రలో నీళ్లను ముట్టుకున్నందుకు ఓ దళిత బాలుడిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. దాంతో ఆయన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.