ఓడలు రేవులావుతాయి...రేవులు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, రేప్ కేసు నిందితుడైన నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నాడు. తన ఆరోగ్యం క్షీణించిందని.. తనకు అత్యవసర వైద్య చికిత్స అందించడం కోసం ఆశ్రయం కల్పించాలని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు ఆగస్టు 7న లేఖ రాశారు. కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకొని.. సొంత కరెన్సీ, పాస్‌పోర్టును సైతం ఏర్పాటు చేసుకున్న నిత్యానంద.. తన దేశంలో వైద్య వసతుల కొరత ఉందని తెలిపాడు.
నిత్యానంద ఆరోగ్యం విషమంగా ఉందని.. వైద్య చికిత్స అవసరమని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంక అధ్యక్షుడికి నిత్యానంద రాసిన లేఖను భారత మీడియా వర్గాలు సంపాదించాయి. శ్రీ కైలాస దేశ విదేశాంగ మంత్రిగా చెప్పుకునే నిత్య ప్రేమానంద స్వామి.. శ్రీలంక అధ్యక్షుడికి ఈ లేఖ రాశారు. ‘నిత్యానంద పరమశివం ఆరోగ్యం విషమించింది. ఆయనకు అత్యవసరంగా వైద్యం అందించాలి. అందుకు సరిపడా వైద్య సదుపాయాలు కైలాస దేశంలో అందుబాటులో లేవు. ఆయనకు వచ్చిన అనారోగ్యమేంటో డాక్టర్లు ఇంకా గుర్తించలేదు. శ్రీ కైలాసలో అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు’ అని లేఖలో పేర్కొన్నారు.
నిత్యానంద ఆరోగ్యం విషమంగా ఉందని.. అత్యవసర చికిత్స అందించాలని.. ఆయన అనుచరులు శ్రీలంకలో కేవలం రాజకీయ ఆశ్రయం మాత్రమే కాకుండా వైద్య సాయం కూడా కోరుతున్నారని రణిల్ విక్రమసింఘేకు రాసిన లేఖలో అభ్యర్థించారు. ‘నిత్యానంద ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వెంటనే ఆయనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని కోరుతున్నా. ఆయన ఎయిర్ అంబులెన్స్ ద్వారా మెడికల్ ట్రీట్మెంట్ కోసం శ్రీలంకకు పంపిస్తాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. కైలాస దేశంతో శ్రీలంక దౌత్య సంబంధాలను ప్రారంభించాలని ఆ లేఖలో కోరారు. శ్రీలంకలో నిత్యానంద వైద్య చికిత్సకు, పరికరాలకయ్యే ఖర్చును తాము భరిస్తామన్నారు. ఆ తర్వాత ఖరీదైన ఆ వైద్య పరికరాలను శ్రీలంక ప్రజలకు ఉపయోగపడేలా అక్కడే వదిలేస్తామని తెలిపారు. వెనక్కి తీసుకోని రీతిలో తమకు రాజకీయ ఆశ్రయం కల్పిస్తే.. నిత్యానంద శ్రీలంకలో పెట్టుబడులు పెడతారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.
నిత్యానంద తన ఇద్దరు శిష్యులను కిడ్నాప్ చేశారని గుజరాత్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో 2018 నవంబర్‌లో ఆయన భారత్ నుంచి పారిపోయారు. చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని విరాళాలు సేకరించారనే ఆరోపణలను నిత్యానంద ఎదుర్కొన్నారు. ఆయనపై కర్ణాటకలో రేప్ అభియోగాలు కూడా ఉన్నాయి. 2010 నిత్యానంద మాజీ డ్రైవర్ లెనిన్ ఆయనపై రేప్ అభియోగం నమోదు చేశారు. వీటన్నింటి కారణంగా ఆయన దేశం విడిచి పారిపోయారు. తమిళనాడుకు చెందిన నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్.