వైఎస్ఆర్ కడప: పెన్నా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో మైలవరం వద్ద పెన్నా నదిపై నిర్మించిన మైలవరం జలాశయం గేట్ల ద్వారా వస్తున్న వరద నీరు, శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు గేట్ల ద్వారా కుందు నది కి నీరు వదలడం, పాపాగ్ని నది నుంచి వస్తున్న వరద నీరు వస్తుండడంతో పెన్నా నది పై నిర్మించిన ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద సోమవారం సాయంత్రానికి భారీగా నీటి ప్రవాహం పెరుగుతుంది.
చెన్నూరు వద్ద పెన్నా నదిలో నీటి ప్రవాహం 13వేల 140 క్యూసెక్కులు వరద నీరు సోమశిల జలాశయంలోకి పరుగులు పెడుతున్నది. గత రెండు రోజులుగా పెన్నా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్నది. ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్ అధికారులు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే చెన్నూరు పెన్నా నది వద్ద సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. పెన్నా నది లో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో రెవెన్యూ అధికారులు వీఆర్ఏలను అప్రమత్తం చేశారు.