అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో విషజ్వరాల పరిస్థితి దారుణంగా ఉంది. డెంగీ జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత ఇళ్లకు చేరుకున్న వరద బాధితుల తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టి 15 రోజులు గడుస్తున్నా కనీసం గ్రామాల్లో హెల్త్ క్యాంపులు కూడా పెట్టలేదని గిరిజనులు వాపోతున్నారు. చింతూరు ఏరియా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోయింది. రోజు 100 కు పైగా జ్వర పీడితులు ఆసుపత్రికి వస్తే అందులో 10 నుండి 20 మంది డెంగీ బాధితులు ఉంటున్నారు. ఆసుపత్రిలో డెంగీ టెస్ట్ కిట్లు లేకపోవడంతో 700 నుండి 1000 రూపాయలు చెల్లించి బయట టెస్టులు చేయించుకోవలసి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విలీన మండలాల్లో ఏరియా ఆసుపత్రి పేరుకు మాత్రమే ఉందని అందులో కనీసం ఒక్కరంటే ఒక్కరూ కూడా పూర్తి స్థాయి వైద్యుడు లేరని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, విలీన మండలాల్లో ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులు లేకపోవడంతో స్థానికంగా ఉన్నా ఆర్.ఎం.పి. వైద్యులను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు, గిరిజన అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటిడిఎ కనీసం స్థానిక గిరిజనులు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోవడం లేదని అసలు ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ, ఉందా లేదా అంటూ స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత గ్రామాల్లో బురద నిండిపోయి ప్రజలు డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఐటిడిఎ అధికారుల్లో చలనం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆసుపత్రిలో వైద్యం చెయ్యడానికి డెంగ్యూ కిట్లు లేవని, మందుల కొరత కూడా తీవ్రంగా ఉందని 2000 ఇంజక్షన్లు కావాలని అడిగితే 20 మాత్రమే వస్తున్నాయని వైద్యులు వాపోతున్నారు ఈ చాలీచాలని మందులతో ఎలా వైద్యం చెయ్యాలని అంటున్నారు.