చెమటలు పట్టడం, వికారం, కళ్లు మసకబారడం లాంటివి గుండె పోటుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక హెచ్చరికలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార విధానంతో గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.
- రోజూ తినే ఆహారంలో కనీసం 50 శాతం కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. బెంగళూరు క్యాబేజీ మొలకలు (బ్రసెల్స్ స్ప్రౌట్స్), క్యాబేజీ, బ్రకోలి లాంటి కూరగాయలు గుండెకు రక్షణగా నిలిచే యాంటీ ఆక్సిండెంట్లు, ఇతర వృక్ష రసాయనాలతో సమృద్ధమై ఉంటాయి.
- రోజూ ఒక పాయ, లేదంటే 300 మి.గ్రా చొప్పున మూడు పూటలా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు. వెల్లుల్లి ఎర్ర రక్తకణాలు గడ్డకట్టకుండా చేసి, ధమనులు సాఫీగా రక్తాన్ని సరఫరా చేసేలా సహకరిస్తుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా చూస్తుంది.
- చక్కెర కలపని పండ్ల రసాలతో రోజును మొదలుపెట్టాలి. బత్తాయి రసంలో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. గుండెపోటుకు కారణమయ్యే హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం స్థాయిని తగ్గించడంలో ఫోలిక్ ఆమ్లం సాయపడుతుంది. ఇక ద్రాక్షపండ్ల రసంలో ఫ్లేవనాయిడ్లు, రెజ్వెరట్రాల్ ఉంటాయి. ఇవి ధమనుల్లో రక్త సరఫరా సాఫీగా సాగేందుకు సాయపడతాయి.
- వారానికి సుమారు 140 గ్రాముల గింజలు తీసుకునేవాళ్లకు గుండెపోటు వచ్చే ఆస్కారం తక్కువని అధ్యయనాల్లో తేలింది. అయితే కొవ్వులు, కెలోరీలు దండిగా ఉండే గింజలు తీసుకుంటే మాత్రం బరువు పెరుగుతారు.
-రోజూ భోజనంలో 2 చెంచాల అవిసెలు తింటే హృద్రోగాల ముప్పును 46 శాతం మేర తగ్గించుకోవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.
- రోజుకు 20 నిమిషాలపాటు నడవడం వల్ల గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా టైప్ 2 మధుమేహం కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.