జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలోని గండికోట రిజర్వాయర్ కు పెన్నానది ద్వారా భారీగా నీటి ప్రవాహం చేరుతోంది. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు చాగల్లు రిజర్వాయరు వరదప్రవాహం భారీగా వచ్చి చేరడం తోచాగల్లు రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని పెన్నానది లోకి విడుదల చేశారు. దీంతో దాదాపు 25వేల క్యూసెక్కుల నీరు పెన్నానది ద్వారా గండికోట రిజర్వాయర్లోకి చేరుతోంది. అలాగే అవుకు జలాశయం నుండి 3వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు గండికోటలోకి చేరుతున్నాయి. గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26. 85టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 26. 1టీఎంసీల నీటి నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టులోకి 28వేల క్యూసెక్కుల ఇన్ల్లో ఉండగా 26, 500క్యూసెక్కులు మైలవరంకు 500క్యూసెక్కులు జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా సర్వరాయసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కాగా మైలవరం రిజర్వాయర్ నుండి 24, 555 క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేశారు. పెన్నానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని గురువారం అధికారులు సూచించారు.