మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో దండెత్తుతూ వస్తున్న ఎర్ర చీమల దండు తాజాగా ఏపీలోని ఓ గ్రామంపై దండేత్తాయి. చీమల దాడి.. ఈ మధ్య కాస్తంత వింతగా అనిపిస్తున్న, వినిపిస్తున్నది ఇదే. చీమదేముంది అలా తొక్కితే ఇలా చనిపోతుంది అనుకోవచ్చు. ఒక్కటైతే సరే.. పదుల సంఖ్యలో అయినా ఓకే. కానీ వేలు, లక్షల్లో చీమలొస్తే..? శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామం మొత్తాన్ని చీమలు చుట్టేశాయి. చెట్టూ, పుట్టా అన్న తేడా లేకుండా ఇళ్లన్నీ చీమల మయమయ్యాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎండ వచ్చిందంటే ఇంటి నిండా చీమలే అంటూ గోల చేస్తున్నారు. అయితే, ఈ చీమలు కుట్టవంటా.. మరేం చేస్తాయో తెలుసా..?
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం పంచాయతీ ఇస్కలపేట వాసులు ఇప్పుడు కొత్త సమస్యతో అల్లాడుతున్నారు. చిన్న ఎర్ర చీమలు ఇల్లు, చెట్లు అని తేడా లేకుండా ఊరంతా పాకిపోయాయంట. ఈ చీమలు శరీరంపైకి ఎక్కుతున్నట్లు కూడా తెలియడం లేదని.. ఇవి కుట్టకుండా నోటితో ఏదో రసాయనాన్ని విడిచి పెడుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అది శరీరంపై కొంత సమయం ఉండి.. ఆ తర్వాత చిన్న చిన్న పొక్కుల్లా వస్తున్నాయని.. గీకితే కురుపులుగా మారి జ్వరం వస్తుందని స్థానికులు చెబుతున్నారు.
అయితే, నిన్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు గ్రామానికి వచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గత కొద్ది రోజులుగా చీమలతో అల్లాడుతున్నామని, వాటి బెడద నుంచి కాపాడాలంటూ వినతిపత్రం అందజేశారు. స్పందించిన స్పీకర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తమిళనాడులోని కరంతమై రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సరిగ్గా ఇలాంటి చీమలే ప్రత్యక్షమయ్యాయి. వీటిని ఎల్లో క్రేజీ యాంట్స్ అనే పేరుతో పిలుస్తుంటారు. అక్కడ ఏడు గ్రామాలపై చీమల దండయాత్ర చేసి పంటపొలాల్ని నాశనం చేసి.. రైతుల పశు సంపదకు కీడు తలపెట్టాయి. పాముల, బల్లులను చుట్టుముట్టి క్షణాల్లో చంపేయగలవు. ఈ చీమలు కుట్టకుండా పొత్తికడుపు కొన దగ్గరుండే చిన్న గొట్టం ద్వారా భయంకరమైన ఫార్మిక్ యాసిడ్‌తో కూడిన రసాయనాన్ని వదులుతాయి. దాంతో చర్మం పొట్టులా రాలిపోతుంది. అదే ద్రవం పశువుల కంట్లో పడితే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఒడిశాలోని పూరీ జిల్లా పిప్పిలి మండలం చంద్రాదెయిపూర్ పంచాయతీ బ్రాహ్మణ సాహి ప్రాంతంలో కూడా ఇలాంటి చీమలే వెలుగు చూశాయి. రెండు నెలలుగా మెల్లగా గ్రామంలోకి వచ్చిన ఈ చీమలు వాటి సంఖ్యను క్రమంగా పెంచుకుని ఆ తర్వాత జనాల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. వీటి బెడద భరించలేక కొందరు ఇప్పటికే వేరే ప్రాంతాలకు కూడా వలస వెళ్లారు. ఇటీవల వరద నీరు గ్రామాన్ని ముంచెత్తిందని, దాంతో అడవుల్లో ఉండే చీమలు ఊర్లోకి వచ్చాయని ఈ చీమలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చీమల ఉధృతికి రాణి చీమే ప్రధాన కారణమని.. దాన్ని గుర్తించి చంపడమే తమ ప్రథమ కర్తవ్యమని, చీమల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు శాంపిళ్లను ప్రయోగశాలకు పంపామని తెలిపారు.
గతంలో ఈ ‘ఎల్లో క్రేజీ యాంట్స్’ కేరళ అడవుల్లోని పలు గ్రామాలపై దండెత్తిన దాఖలాలు ఉన్నాయి. కేరళ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. గతంతో పోల్చితే ఇప్పుడు ఈ చీమల జాతుల విస్తరణ బాగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన చేసిన అడవుల్లో గొంగళి పురుగులు, సీతాకోకచిలుకలు, ఇతర కీటకాలు, ఈగల సంతతి తగ్గినట్లు గుర్తించామని వివరించారు. ఇవి ఆసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 4-5 మి.మీ. వరకు పొడవు ఉండే ఈ చీమలకు పొడవైన కాళ్లు, తల మీద పొడవైన యాంటెన్నా లాంటివి ఉంటాయి. పసుపువన్నెలో ముదురు గోధుమ రంగులో ఉండే ఈ చీమలు 80 రోజుల వరకు జీవించగలుగుతాయి.
ఆస్ట్రేలియాలోని క్రిస్‌మస్ ఐలాండ్‌లో ఈ చీమల దండు లక్షలాది ఎర్ర పీతలను చంపి తినేశాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటిపై అనేక పరిశోధనలు చేసి పరిష్కార మార్గాన్ని కనుగొంది. నివారణకు హెలికాప్టర్ల ద్వారా రసాయనాలను స్ప్రే చేయడంతో 95-99 శాతం ఫలితాలొచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న తుమ్మెదలాంటి కీటకం ద్వారా సహజ విధానంలోనే ఈ చీమల ఆహార గొలుసును తుంచి వాటి సంతతి పెరగకుండా చూడడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి.