స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే వినతులను జాప్యంలేకుండ సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్, డి. అర్. ఓ జల్లెపల్లివెంకటరావు, సబ్ కలెక్టర్ భావన వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 109 దరఖాస్తులు అందాయి. ఎక్కువగా భూ సమస్యలు, రేషన్ కార్డు మంజూరు చేయాలని, ఉపాధి కల్పించాలని అర్జీలు అందజేశారు.
డేంగాల గుడ్డి మెట్ట సర్వే నం. 57/7లోని భూమిని చాలా ఏల్లుగా సాగు చేస్తూ జీవనాధారం సాగిస్తున్నామని కొడపొడు హక్కు కల్పించి, పట్టా మంజూరు చేయాలని మండలంలోని పెదమరికి గ్రామానికి చెందిన నిమ్మక సరోజినీ వినతి పత్రం అందజేశారు. గిరిజన భూములు గిరిజనులకే చెందాలని, గిరిజనేతరలు భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని మండలంలోని శివన్న దొర వలస గ్రామానికి చెందిన ఉర్లక విజయకుమార్, పలువురు గిరిజనులు వినతిపత్రాన్ని సమర్పించారు. సాలూరు మండలం దలాయివలస గ్రామంలో సుమారు ఏ 350 సెంట్లు భూమి సాగులో ఉందని వర్షాభావం కారణంగా పంట నష్టానికి గురౌతుందన్నారు. పొలాలకు సాగునీరు అందించేందుకు త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని అదే గ్రామానికి చెందిన వి. కామయ్య, పలువురు రైతులు కోరారు.
గ్రామ వాలంటీర్ పోస్ట్ కు అన్ని అర్హతలు కులాంతర వివాహం అనర్హతగా చూపుతూ అడ్డుకుంటున్నారని, తనకు గ్రామ వాలంటీర్ గా నియమించాలని పాలకొండ మండలం బుక్కనూరు గ్రామానికి చెందిన పిన్నింటి కల్యాణి ఫిర్యాదును అందించారు. సీబిల్లి పెద్ద వలస గ్రామ రెవెన్యూ పరిధిలోని 490లోని 475- 2 లోని 0. 56 సెంట్ల భూమికి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన అరటి పంట నష్టరిహారాన్ని వేరొకరి పేరున నమొదైనందున తన పంట నష్ట పరిహారం చెల్లించాలని మక్కువ మండలం సంబర గ్రామానికి చెందిన వడిగల్ల వేణుగోపాల రావు అర్జీ అందజేశారు. దుగ్గేరు గెడ్డ వలన ముంపు వలన ఇరు గ్రామ ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల సౌకర్యర్థం కొరకు వంతెన నిర్మాణం చేపట్టాలని మక్కువ మండలం పనస బద్ర గ్రామానికి చెందిన ఎమ్. గిరిధర్ రావు కోరారు. తిత్తిరి అర్ అండ్ బి రహదారి నుంచి ఆగం గూడ, వెలగమాను గూడ గ్రామానికి సిసి రోడ్, బి. టి రహదారి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు అయినందున పనులు త్వరితతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని కురుపాం మండలం వలస బల్లేరు గ్రామ సర్పంచ్ బి. కుసుమ వినతి పత్రాన్ని సమర్పించారు.
అనంతరం వికలాంగులైన మర్రపు రామ రావు, సిమ్మ చంటి, తాడంగి నిర్మల లకు మూడు చక్రాల సైకిల్ మంజూరు చేయాలని కలెక్టర్ కు కోరగా వెంటనే మంజూరు చేయాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సహాయ సంస్థ మేనేజర్ ఎన్. కిరణ్ కుమార్ ను ఆదేశించారు. వికలాంగులు సుదూరంగా నుంచి జిల్లా కేంద్రానికి రాకుండా గ్రామ సచివాలయంలో నే దరఖాస్తుకుంటే అక్కడే సైకిళ్ళు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా మేనేజర్ ను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.