జెఇఇ అడ్వాన్స్డ్ విజేత జాగాన దీపికకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. దీపిక అఖిల భారత స్థాయిలో దివ్యాంగుల (పి. డబ్ల్యు. డి) విభాగంలో 22వ ర్యాంకు సాధించారు. పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన దీపిక పార్వతీపురంలో సురేష్ పాఠశాలలో 10వ తరగతి, వాసవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఇంటర్మీడియట్ లో 97 శాతం మార్కులు సాధించారు. దీపిక తండ్రి శ్రీనివాస రావు అధ్యాపకులుగా పనిచేస్తుండగా, తల్లి అనురాధ గృహిణిగా ఉన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఉద్బోధించారు. చదివే అంశాల పట్ల స్పష్టమైన అవగాహన అవగాహన పెంపొందించుకొని చదవాలని ఆయన పేర్కొన్నారు. ఇష్టంతో చదివితే కష్టం అనిపించదని, ఒత్తిడి ఉండదని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇష్టమైన రంగాన్ని ఎన్నుకుని కీర్తి పతాక ఎగుర వేయాలని, తల్లిదండ్రులకు, జిల్లాకు గౌరవాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు.