భారత మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప ఇటీవల భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన క్రికెట్ కెరీర్‌లో తనకు మద్దతుగా నిలిచిన తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సుదీర్ఘమైన నోట్‌ను రాయడం ద్వారా ఉతప్ప తన రిటైర్మెంట్‌ను ప్రకటించడానికి సోషల్ మీడియాకు వెళ్లాడు. ఈ పరిణామాల మధ్య ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో క్లినికల్ డిప్రెషన్‌కు గురయ్యానని ఎందుకలా డిప్రెషన్ ఎదుర్కొన్నానో కూడా తెలియదంటూ పేర్కొన్నాడు. 2009ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పాడు. 'నేను 2009లో క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడ్డాను. నాకు ఎందుకలా జరిగిందో కూడా తెలియదు. 2009 ఐపీఎల్ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను' అని ఉతప్ప చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఉతప్ప అరంగేట్రం చేశాడు. కానీ 2009 రెండో సీజన్‌లో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. 'నేను నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. ఆర్‌సీబీతో ఆడినప్పుడు పూర్తిగా డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ సీజన్‌లో నేను ఒక్క ఆట కూడా సరిగ్గా ఆడలేదు. వారు నన్ను డ్రాప్ చేయాలనుకున్నప్పుడు నేను ఒక మ్యాచ్‌లో బాగా ఆడాను. అందుకే మళ్లీ జట్టులో చేరాను. అంతకు ముందు కూడా నన్ను కొన్ని కష్టాలు చుట్టుముట్టాయి. నేను ముంబై జట్టు నుండి బదిలీ పత్రాలపై సంతకం చేయకపోతే, నేను ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడలేనని ఎంఐకి చెందిన ఒకరు నాకు చెప్పారు' అని ఉతప్ప చెప్పాడు.