పాము కాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు ఘంటసాల మండలం శ్రీకాకుళం ఎస్టి కాలనీలో నివాసం ఉంటున్న యానాదులు ప్రతిరోజు ఎలుకలు బుట్టలు పెట్టడానికి వెళుతుంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం చల్లా వెంకయ్య (రవి ) మరికొంతమంది వెలువోలు నాలుగో నెంబర్ కాల్వ దగ్గర ఎలుక బుట్టలు పెట్టేందుకు చేలోకి వెళ్లారు.
ఈ క్రమంలో వెంకయ్యకు పాము కాటువేయగా, కొంత దూరం నడుచుకుని బయటకు వచ్చాడు. ఈ విషయాన్ని తోటివారితో చెప్పడంతో హడావుడిగా శ్రీకాకుళం తీసుకొచ్చారు. వెంటనే 108లో అతన్ని మొవ్వ పి. హెచ్. సికి తీసుకెళ్లగా, అంబులెన్సు లోనే పల్స్ తగ్గిపోయి వెంకయ్య మృతి చెందినట్లు డాక్టర్ వేదరాజ్ తెలిపారు. మృతునికి భార్య శివగంగ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి మృతితో ఎస్టి కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.