ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమి పాలవగానే నేను వెనుకంజ వేస్తానని అనుకున్నారు: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 18, 2022, 07:32 PM

తాను అవమానాలకు భయపడే వ్యక్తిని కాదని, 2019లో ఓటమి పాలవగానే తాను వెనుకంజ వేస్తానని అనుకున్నారని, అలా ఎప్పటికీ జరగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నామని, గెలిచే అభ్యర్థులే బరిలో దిగుతున్నారని పవన్ కల్యాణ్ ఆత్మవిశ్వాసంతో చెప్పారు. 


మంగళగిరిలో నేడు జరిగిన జనసేన లీగల్ సెల్ సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది రాజకీయాల్లోకి రావడమేనని అన్నారు. తాను 2003 నుంచి రాజకీయ అధ్యయనం చేస్తున్నానని, 2009లో ఒక మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా, అనేక కారణాలతో వైఫల్యం చెందామని, మళ్లీ అటువంటి తప్పు నా ఊపిరి ఉన్నంతవరకు జరగకూడదన్న ఉద్దేశంతో 2014లో జనసేన పార్టీ స్థాపించడం జరిగిందని తెలిపారు. 


రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన హీరో అని, నానీ పాల్కీవాలా తనకు ఆదర్శమని వెల్లడించారు. వారి స్ఫూర్తితోనే ఒక తరంలో మార్పు తీసుకువచ్చేందుకు పనిచేయడానికి వచ్చానని పవన్ కల్యాణ్ వివరించారు. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం అనే అంబేద్కర్ మాటలు తనకు ప్రేరణ అని, అందుకే జనసేన లీగల్ సెల్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లీగల్ సెల్ అని పేరు పెట్టామని వివరించారు. అధికారంలో లేని అణచివేయబడిన వర్గాలకు అండగా నిలబడాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ ఉద్ఘాటించారు. పార్టీ నిర్మాణానికి కావాల్సింది లక్షల కోట్లు కాదని, సైద్ధాంతిక బలం ఉన్న వ్యక్తులు అని, అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే జనసేన నానాటికీ బలోపేతం అవుతోందని స్పష్టం చేశారు. 


అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, తన వద్ద వేల కోట్లు లేనప్పటికీ రాజకీయ పార్టీ పెట్టానని, అందుకు కారణం మార్పు కోసం నడవగలను అనే ధైర్యం, నిలబడగలను అనే నమ్మకమేనని పేర్కొన్నారు. చెట్టు మీద ఉన్న పక్షి ఎగిరిపోయినా చెట్టు అక్కడే ఉంటుందని, తాను ఆ చెట్టు లాంటి వాడినని పవన్ అన్నారు. తుపానులు చుట్టుముట్టినా అది నేలకు అంటిపెట్టుకునే ఉంటుందని తెలిపారు. పార్టీలోంచి వ్యక్తులు వెళ్లిపోయినా, పార్టీ ఎక్కడికి వెళ్లదని, తాను నిలబడే ఉంటానని ఉద్ఘాటించారు. సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటిపెట్టుకుని ఉన్న కోట్లాది మంది ప్రజల్లాగా తాను కూడా ఈ పార్టీని, నేలను, దేశాన్ని సమాజాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


అక్టోబరు నుంచి నియోజకవర్గాల వారీగా మంగళగిరి కార్యాలయంలో సమీక్ష సమావేశాలు జరుగుతాయని, ముందుగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంతో మొదలుపెడుతున్నామని తెలిపారు. తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినంత మాత్రాన మీరేమీ మహాత్ములు అయిపోరంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా అని ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటారా అని తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సృష్టిలో ప్రతిదానికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని, అది అన్నింటికీ వర్తిస్తుందని, ఈ విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. 


వైసీపీ సర్కారు దాదాపు రూ.450 కోట్ల భవన నిర్మాణ కార్మిక నిధులు, ఎల్ఐసీ ప్రీమియం నిధులు, రూ.1,100 కోట్ల మేర డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ను మళ్లించేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో జనసైనికులు, వీరమహిళలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వారిపై కేసులు పెడుతున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. లీగల్ సెల్ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 


ఒక్క చాన్స్ ఇద్దాం అని వైసీపీని గెలిపిస్తే అది ఈ రోజు రాష్ట్రానికే ఇబ్బందికరంగా మారిందని, రాష్ట్రం తిరోగమనంలో పయనించే పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. దొమ్మీలు, దోపిడీలు చేసేవారిని ఎన్నుకుంటే రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ కూర్చుంటారని అన్నారు. కనీసం మహిళల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, 14 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైతే ఇప్పటిదాకా న్యాయం జరగలేదని ఆక్రోశించారు. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ నాయకులు చట్టసభల్లో ఉంటే బాగుండేదని అనిపించిందని వెల్లడించారు. 


మొన్న ఒక మహిళ అత్యాచారానికి గురైతే... బాధ్యత కలిగిన హోంమంత్రి తానేటి వనిత నిందితులను శిక్షిస్తాం అనకుండా, నిందితుడు రేప్ చేయడానికి రాలేదు, దొంగతనానికి వచ్చి అనుకోకుండా రేప్ చేశాడు అని అనడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాము జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే ఎంతో మంది దివ్యాంగులు వారి సమస్యలు చెప్పారని, కనీసం వారికి అండగా నిలవలేని ప్రభుత్వాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa