తెలుగుదేశం పార్టీపై శాసనసభ వేదికగా ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు వలన ముంపునకు గురైన నిర్వాసితుల భూములకు పరిహారంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు వలన ముంపునకు గురైన నిర్వాసితుల భూములకు నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు రూ.10 లక్షల ఇస్తామని జీవో ఇచ్చిన మాట వాస్తవమేనా అని టీడీపీ సభ్యులు అడగ్గా.. అది వాస్తవం కాదని మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో నేరుగా ఈ అంశంపై సీఏం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ, వాస్తవాలు బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబు నాయుడేనని, ఆయన ఎమ్మెల్యేగా కూడా అన్ ఫిట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గతంలో రూ. 6.86 లక్షలు ఇస్తే, అధికారంలోకి వచ్చాక రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పామని.. చెప్పిన మాట ప్రకారం దీనిపై జీవో కూడా జారీ చేశామని సీఏం జగన్ స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 14,110 మంది నిర్వాసితులుకు రూ. 19, 060 కోట్లతో పునరావాసం కల్పిస్తున్నామని, తమ ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మొదట స్పిల్‌వే, అప్రోచ్ పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉందని సీఏం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ సభ్యులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఏం జగన్ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏం చెప్పామో.. ఆ చెప్పినదానికి ఒక జీవోను 30 జూన్ 2021న ఇచ్చామని జీవో ప్రతిని టీడీపీ సభ్యులకు చూపించారు సీఎం జగన్. పొలవరం బాధితులకు పునరావాసం పూర్తికాగానే పరిహారం బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం నుంచి రూ.2,900 కోట్ల నిధులు రావాల్సి ఉందని, ఆ నిధులు బ్లాక్ కావడం వెనుక ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. ఆనాడే కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులు.. నిర్వాసితులకు అందిన పరిహార విషయంలో చంద్రబాబు హయాంలో గణాంకాలు.. తమ ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ఎవరికి చిత్తశుద్ధి ఎంత ఉందో స్పష్టం అవుతుందని సీఎం జగన్ తెలిపారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన స్లైడ్స్ వేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు. చంద్రబాబు నాయుడు తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్నారు.
ప్రాజెక్టు పనులకు సంబంధించిన స్లైడ్స్ వేసి మరీ టీడీపీకి ‘సినిమా’ చూపించిన సీఎం జగన్ అన్న.#APAssembly#PolavaramProject#CMYSJagan pic.twitter.com/Web0ykvhYt
— Anitha Reddy (@Anithareddyatp) September 19, 2022