దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పెగాసస్ పై వేసిన ఏపీ అసెంబ్లీ కమిటీ నివేదిక రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు రానున్నది. ఇదిలావుంటే ఏపీ రాజకీయాలలో పెగాసస్ వ్యవహారం కలకలంరేపిన విషయం తెలిసిందే. దీనిపై వేసిన కమిటీ కీలక నివేదిక రేపు (మంగళవారం) ఏపీ అసెంబ్లీ ముందుకు రానుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు నాటి ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ సంస్థకు చెందిన నిఘా పరికరాలను కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం... శాసన సభా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆయా శాఖలకు చెందిన అధికారులను విచారించింది. ఆయా శాఖల వద్ద ఉన్న ఆధారాలను కూడా సేకరించింది. అధికారుల విచారణ, ఆధారాల సేకరణలతో మొత్తంగా 85 పేజీలతో కమిటీ తన నివేదికను రూపొందించింది. టీడీపీ ప్రభుత్వం పెగాసస్ పరికరాలను కొనుగోలు చేసినట్టు కమిటీ తేల్చినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ నివేదిక నేపథ్యంలో రేపటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.