ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు జడ్జి దేవానంద్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ బట్టు నిన్న విజయవాడలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ఓ పుస్తకావిష్కరణకు హాజరైన ఆయన, ఢిల్లీలో చదువుతున్న తన కుమార్తెను మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యల నేపథ్యంలో, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. హైకోర్టు జడ్జి దేవానంద్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం పదేపదే వివాదం సృష్టిస్తూ, దేశవ్యాప్తంగా ఏపీ పరువును మంటగలుపుతోందని రామకృష్ణ విమర్శించారు. హైకోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకపోవడం జగన్ మోహన్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, తద్వారా రైతుల పాదయాత్రను విరమింపజేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.