విద్యార్థినీల ఆందోళనతో చండీగఢ్ యూనివర్సిటీ ఉన్నతాధికారులు దొచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చండీగఢ్ యూనివర్సిటీ అమ్మాయిల లీక్‌డ్ వీడియోల కేసులో న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థినులు తమ ఆందోళన విరమించారు. విద్యార్థినులు తమ ముందు ఉంచిన డిమాండ్లకు యూనివర్సిటీ అధికారులు అంగీకారం తెలపడంతో గత అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు. అలాగే, ఈ నెల 24వ తేదీ వరకు తరగతులను రద్దు చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా హాస్టల్ వార్డెన్లను బదిలీ చేయడంతోపాటు హాస్టల్ సమయాలను కూడా మార్చారు.
హాస్టల్‌లోని అమ్మాయిల అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడంతో శనివారం రాత్రి యూనివర్సిటీ క్యాంపస్‌లో వందలాదిమంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్నేహితురాళ్ల అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు, అతడి స్నేహితుడు (31)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుంటే హాస్టల్ బాత్రూములో స్నానం చేస్తున్న 60 మంది అమ్మాయిల వీడియోలు లీకైనట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే, యూనివర్సిటీ మాత్రం ఒకే ఒక్క వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని, అది ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి వ్యక్తిగత వీడియో అని చెబుతోంది. వీడియోను అమ్మాయే తీసుకుని దానిని తన బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసిందని పేర్కొంది. మరోవైపు, ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఈ కేసుపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు.