దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం నేపథ్యంలో ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన వంద మందిని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్టు చేసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిపిన దాడుల్లో మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.
ఎన్ఐఏతోపాటు, ఈడీ, వివిధ రాష్ట్రాల పోలీసులు కలిపి 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకతోపాటు మొత్తం 13 రాష్ట్రాల్లోని వంద స్థావరాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐ. ఈ సంస్థ తీవ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, శిక్షణలో సాయం అందించడం, తీవ్రవాద సంస్థల్లో సభ్యులను చేర్చడం వంటి కార్యకలాపాలకు పాల్పడింది. ఈ సంస్థ యూఏఈ, ఒమన్, కతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నిధులు వసూలు చేసింది. ఈ నిధులను హవాలా మార్గంలో తరలించింది. అలాగే బోగస్ బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేసి, అక్రమ లావాదేవీలకు పాల్పడింది.
ఈ అకౌంటులో పేర్లు ఉన్న వాళ్లు చాలా మంది లేరు. వందల మంది అకౌంట్లను పరిశీలించిన తర్వాత ఎన్ఐఏ ఈ విషయంలో నిర్ధరణకు వచ్చింది. ఇక కేరళలోని మళప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ పార్టీ ఛైర్మన్ ఒమా సలాం ఇంటితో సహా పలువురు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల సందర్భంగా పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. తెలంగాణలోని హైదరాబాద్, గుంటూరు, కరీంనగర్, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల్ని కేంద్ర హోం శాఖ పర్యవేక్షిస్తోంది.