అమరావతి పాదయాత్ర అనేది టీడీపీ యాత్ర అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని..అందుకే తన బినామీలతో చేయించే యాత్ర ఇది అని అన్నారు. ఈ యాత్రలో రైతులెవ్వరూ లేరని.. కేవలం చంద్రబాబు మనుషులే ఉన్నారని తెలిపారు. ప్రజాదరణ లేని టీడీపీ యాత్రకు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు కనీసం తమ పార్టీ కండువా కూడా కప్పుకొని స్వాగతం పలికే స్థితిలో లేరన్నారు. పచ్చ కండువా కప్పుకొని పాదయాత్రలో తిరుగుతున్నారన్నారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరినీ కొట్టి అమరావతిలో ఉన్న డబ్బున్నోళ్లకి పెడుతున్నాడు. అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదు. కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొనట్లేదు. ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే వైఎస్సార్‌సీ లక్ష్యం. పేదల ఆర్థిక స్థితిగతిని మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసలు రాద్దాంతం చేస్తున్న ఈ చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎంత మానసిక క్షోభ అనుభవించేలా చేసాడో తెలుసా. పార్టీ నుండి సస్పెండ్ చేసి, కనీసం చివరిగా అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడతాను అంటే మార్షల్స్‌ను పెట్టి బయటకు గెంటాడు. మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫోటో లేకుండా చేసాడు. చనిపోయిన తర్వాత మాత్రం దండ వేసి ఎనలేని భయభక్తులు చూపించాడు' అని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.