పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై మంగళవారం మరోసారి ఎన్ఐఏ అధికారులు దాడులు చేపట్టారు. పీఎఫ్ఐ పెద్ద కుట్రే చేసింది. దేశంలోని ఆరెస్సెస్, బీజేపీ అగ్ర నేతలే టార్గెట్‌గా పన్నాగం పన్నింది ఆ సంస్థ. ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగుచూస్తున్న తాజా విషయాలు విస్తుగొల్పుతున్నాయి. నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం పీఎఫ్‌ఐ టార్గెట్ లిస్ట్‌లో ఉందని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని ఈ సంస్థ ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. వీరిని టార్గెట్ చేసుకుని దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ, సంఘ్‌నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు నిర్వహించడం కలకలం రేపుతోంది.
దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు మరోసారి దాడులు చేశారు. 8 రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు నిర్వహించారు. PFI సంస్థలు, ఆ సంస్థ సభ్యుల నివాసాలపై దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. కర్నాటకలో 12 చోట్ల రైడ్స్ నిర్వహించగా.. ఆరుగురు PFI సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారు నవాజ్ పాషా, వసీమ్ పాషా, సిద్ధిఖ్ పాషా, ఇంతియాజ్ పాషా, షాబాజ్ పాషా, అల్లాబకాష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక వ్యాప్తంగా 45 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 106 మంది పిఎఫ్ఐ ఏజెంట్లను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. ఇటీవలే 95 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసిన విషయం తెలిసిందే. మొదటి రౌండ్ దాడులలో అరెస్ట్ అయిన PFI నేతల నుంచి రాబట్టిన సమాచారంతో దాడులు నిర్వహించారు.