ఓ వ్యక్తి సాహసపూరిత రోప్ వాక్ చేసి గిన్నిస్ రిక్డార్డ్ లో ఎక్కాడు. చిన్నప్పుడు జాతరలు, వేడుకల సమయంలో తాడుపై నడిచే గారడీ వాళ్లను చూసే ఉంటాం. మహా అయితే పది, ఇరవై మీటర్లు దూరం తాడుపై నడుస్తుంటారు. అదీ రెండు, మూడు మీటర్ల ఎత్తులోనే ఉండేవి. ఈ మధ్య అలాంటివి కనిపించడం లేదుగానీ.. సాహస కృత్యాల్లో భాగంగా నిపుణులు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వందల అడుగుల ఎత్తులో, వందల కొద్దీ మీటర్లు తాడుపై నడవడం వంటివి చేసి రికార్డు సృష్టిస్తుంటారు. అలాగే నాథన్ పౌలిన్ అనే రోప్ వాకర్.. తాజాగా గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
ఫ్రాన్స్ సముద్ర తీరంలో చిన్న దీవి తరహాలోని కొండ, దానిపై మోంట్ సెయింట్ మైఖేల్ కోట ఉంటాయి. యునెస్కో గుర్తింపు ఉన్న ఈ కోట నుంచి తీరంలోని ఓ భారీ భవనం వరకు.. 1.4 మైళ్లు (సుమారు రెండు కిలోమీటర్లు) పొడవునా గట్టి ఇనుప తాడును కట్టారు. వందల అడుగుల ఎత్తున ఉన్న ఆ తాడుపై సుమారు 7,218 అడుగుల దూరం నాథన్ పౌలిన్ నడిచి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇన్ స్టా 360 అనే కెమెరా కంపెనీ ఈ ఫీట్ ను వివిధ కోణాల్లో, డ్రోన్లతో చిత్రీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో పెట్టింది.
అంత ఎత్తులో, అంత దూరం రోప్ వాక్ చేయడంపై నాథన్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు అసాధ్యమైన ఫీట్ ఇది. కొన్నిసార్లు ఇలాంటివి ఎన్నైనా చేయగలిగేంత శక్తిమంతుడిని అనిపిస్తుంది. మరికొన్నిసార్లు నేను చాలా మామూలు వాడిని అనిపిస్తుంది. ఏదైనా ఈ ఫీట్ ను పూర్తి చేయగలగడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నాడు. ఇంతకుముందు కూడా ఇలా ఎత్తున రోప్ వాక్ రికార్డు నాథన్ పేరిటే ఉంది. 2017లో పారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కు, సమీపంలోని ట్రొకడెరో స్క్వేర్ టవర్ కు కట్టిన తాడుపై 2,198 అడుగుల పొడవున నాథన్ రోప్ వాక్ చేశాడు.