పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) పై కేంద్ర ప్రభుత్వం చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తొయిబా, ఆల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని పీఎఫ్‌ఐ సంస్థపై ఆరోపణలున్నాయి. దీనితో పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో దాడులు చేసి 106 మందిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాద సంస్థల్లో చేరేలా యువతను ప్రోత్సహించడంతో పాటు ఉగ్రవాద శిక్షణ, ఆయుధాలను ఇచ్చినట్లు గుర్తించింది ఎన్‌ఐఏ. ఇటీవల పాట్నాలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేసినట్లు కూడా ఆరోపణలన్నాయి.