శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు గురువారం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ ప్రాంతాలకు చెందిన 15 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి.ఇందులో పుదుచ్చేరికి కళాకారులు ఓళియాట్టం, పొడుగు కర్రలతో చేసిన సంప్రదాయ భజన, కర్ణాటక కళాకారుల భరతనాట్యం, మహారాష్ట్ర కళాకారులు కోలాటం భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అదేవిధంగా, తూర్పుగోదావరి జిల్లా మల్లేపల్లికి చెందిన మారుతి నాసిక్ డోలు బృందం అఘోరా నృత్యం, భువనేశ్వరి భజన మండలి తాళాలతో చేసిన నృత్యం, అనంతపురానికి చెందిన శ్రీకృష్ణ బృందం సంప్రదాయ నృత్యం, బెంగళూరుకు చెందిన కైలాసధర బృందం నృత్యం, తిరుపతికి చెందిన ఆనందనిలయవాసా భజన మండలి నృత్య కార్యక్రమాలు అలరించాయి.వీటితోపాటు విశాఖపట్నం, అనకాపల్లి, విశాఖ, తిరుమల, తిరుపతి కళాకారుల కోలాటం భజన, తెలంగాణ రాష్ట్రం మహబూబర్ నగర్ కళకారుల చెక్కభజన, అన్నమయ్య జిల్లా కళాకారుల పిల్లనగ్రోవి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.