ఆంధ్రప్రదేశ్ ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను రిలీజ్ చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 77 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని అన్నారు. ఈ పరీక్షల్లోనూ అమ్మాయిలే సత్తా చాటారు. 66 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల్లో 23 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలకు మొత్తం 44,208 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. జల్లెల నందిని మయూరీ అనే అమ్మాయి ఈ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
టాప్ 20 ర్యాంకర్లందరూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో 9 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారన్నారు. ప్రవేశ పరీక్షలో 90 శాతం పైన మార్కులు సాధించిన విద్యార్థులే అర్హత పొందారని చెప్పారు. కనిగిరిలో పూర్తి స్థాయిలో క్యాంపస్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని, రెండేళ్ళలో ఈ క్యాంపస్‌ను నిర్మించి ఒంగోలు నుంచి షిఫ్ట్ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు క్యాంపస్‌లను పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలనే దిశగా కృషి చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.