కలర్ ఫుల్ జీవితాలు చాలా వరకు విషాధంగానే ముగిస్తున్నాయి. తాజాగా ఓ మోడల్ ఆత్మహత్య చేసుకొంది. మానసిక ఒత్తిడి, ప్రేమ వైఫల్యాలు, సరైన అవకాశాలు రాకపోవడం తదితర కారణాలతో మన దేశంలో మహిళా మోడళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో కోల్ కతాలో వరుసగా చోటు చేసుకున్న ఆత్మహత్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి.
మరోవైపు, ముంబైలో తాజాగా మరో మహిళా మోడల్ బలవన్మరణానికి పాల్పడింది. ముంబై అంధేరీలోని ఒక హోటల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్ కు వేలాడుతున్న 30 ఏళ్ల మోడల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు చెపుతున్న వివరాల ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో మృతురాలు హోటల్ లోకి చెకిన్ అయింది. డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. గురువారం గది తలుపును ఆమె తెరవలేదు. హౌస్ కీపింగ్ స్టాఫ్ పలు మార్లు పిలిచినప్పటికీ ఆమె రెస్పాన్స్ కాలేదు. దీంతో, హోటల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు హోటల్ గదిలో పోలీసులు సూసైడ్ నోట్ ను గుర్తించారు. 'నన్ను క్షమించండి. నా మరణానికి ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా లేను. నాకు శాంతి కావాలి' అని మృతురాలు సూసైడ్ నోట్ లో పేర్కొంది.