పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో గొప్ప విప్లవాత్మక అడుగుపడుతోంది. వైయస్‌ఆర్ కల్యాణమస్తు, వైయస్‌ఆర్ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు చేసుకునేవారు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తెచ్చాం. ఇది ఈ జనరేషన్‌ను ప్రోత్సహించడం ఒక్కటే కాదు.. తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకొని ఉంటే.. వారికి పుట్టే పిల్లలను కూడా చదివించే గొప్ప పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమలులోకి రానున్నాయని సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో పెళ్లికానుక పేరుతో అందించే సాయం 2018లో అర్థాంతరంగా నిలిపేశారని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. మనందరి ప్రభుత్వం మన పిల్లలకు మంచి జరగాలని, వైయస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను తెచ్చిందని, సాయాన్ని గతం కంటే రెట్టింపు చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. వివాహమైన 60 రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతీ మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారులందరికీ సాయం అందించడం జరుగుతుందని తెలిపారు.