5జీ సేవల్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో నేడు ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ 5జీ సేవల్ని ప్రారంభించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో దీపావళి నాటికి 5జీ నెట్‌వర్క్‌లో హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. తొలి విడతలో దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అత్యున్నత క్వాలిటీతో వీడియోలు చూడటంతోపాటు. టెలీసర్జరీ, అటానమస్ కార్లు తదితర సేవలను 5జీ సర్వీసులతో తేలిగ్గా పొందొచ్చు. విపత్తుల సమయంలో రియల్ టైం మానిటరింగ్, వ్యవసాయరంగంలో మార్పులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ప్రదేశాల్లో మనుషుల పాత్రను తగ్గించడం లాంటివి 5జీ సేవలతో సాధ్యమవుతాయి. 5జీ సేవల ప్రారంభోత్సవం సందర్భంగా స్వీడన్‌లో ఉన్న కారును ప్రధాని మోదీ ఎరిక్‌సన్ బూత్ నుంచి వర్చువల్‌గా నడిపారు
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5జి సర్వీస్ అనేది కొత్త ఆర్థిక అవకాశాలతో పాటు సామాజిక ప్రయోజనాలను కూడా ఆవిష్కరించగలదని, ఇది దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించడంతోపాటు ‘డిజిటల్ ఇండియా’ విజన్ ను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని, 2035 నాటికి భారతదేశంపై 5జి ఆర్థిక ప్రభావం 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక మరో స్టాల్‌లో 5జీ నెట్వర్క్ ఉపయోగించి రిమోట్ పద్ధతిలో కారును ఎలా నడపొచ్చో తెలుసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ . స్వయంగా స్టీరింగ్ పట్టుకొని వాహనాన్ని నడిపారు. రోబోటిక్స్, అగ్రికల్చర్ లాంటి రంగాల్లో 5జీ సేవల్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకున్నారు.కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, భారతదేశంలో అతిపెద్ద టెలికామ్ కంపెనీ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ నుంచి సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జియో ట్రూ 5జీ సేవలు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారు. వైద్య రంగానికి జియో ట్రూ 5జీ సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆకాశ్ అంబానీ ప్రధాన మంత్రికి వివరించారు.