రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నిర్మాణాలు చేసి వాటికి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చని మాజీమంత్రి రాజాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోండ్రు మురళీమోహన్ విమర్శించారు. రాజాం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్లో మూడవరోజు శుక్రవారం వంగర మండల టిడిపి నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ అనే పేరు తొలగిస్తున్న కారణంగా టిడిపి నిరసన కార్యక్రమం కొనసాగిస్తుందని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పాత పేరు కొత్త ప్రభుత్వం కొనసాగించడం జరుగుతుందని అన్నారు. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాత పేర్లు తొలగించి కొత్త రాజకీయానికి తెర తీసింది అన్నారు. ఇందులో భాగంగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అభివృద్ధి ఏమీ చేయలేక ఇలాంటి పనులు చేస్తున్నారని దీని ద్వారా రాజకీయంగా పార్టీకి దెబ్బకొట్టాలని చూస్తున్నారన్నారు. ఇలాంటి జిమ్మిక్కులు చేసినా ప్రజలు వైసీపీ ప్రభుత్వం పై విసుగు చెందారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.