ఏపీ ప్రజలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. 24 గంటల్లో మరో వాయుగుండం తప్పేలా లేదు.. ఇప్పటికే వరుస వాయుడుగండాలతో ఏపీ తడిసి ముద్దవుతోంది. మరో వాయుగుండం తాకనుందనే సమాచారం ప్రజలను మరింత వణికిస్తోంది.ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసాతీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా ఒంపు తిరిగి ఉందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక మరో మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని చోట్ల భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రానున్న రెండు రోజులు అవసరం ఉంటేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలను కోరారు.ముఖ్యంగా ఇవాళ.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు మొదలయ్యాయి కూడా.. విశాఖలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవొచ్చు.. ఇక అనంతపురం జిల్లాలో ఈ రోజు భారీ వానలు కురిసే అవకాశం ఉంది.
ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలకు తోడు పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఎస్ కోట, సాలూరు పరిశర ప్రాంతాలతో పాటు.. కాకినాడ జిల్లాలను సైతం భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వర్షాలు కూడా పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.